ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా భయపెడితే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి: ధూళిపాళ్ల నరేంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:22 AM

ప్రభుత్వ సలహాదారులే పారిశ్రామికవేత్తలను భయపెట్టేలా మాట్లాడుతుంటే.. ఏపీకి పెట్టుబడులు, ఉద్యోగాలు ఎలా వస్తాయని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. తన కంపెనీలు, తన బినామీ సంస్థలు తప్ప.. రాష్ట్రంలో ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్లుగా పారిశ్రామికవేత్తలపై సీఎం జగన్ కక్షగట్టారని ఆయన దుయ్యబట్టారు. 


టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణకు పోవడానికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అమర్ రాజా బ్యాటరీస్ యాజమాన్యాన్ని ప్రభుత్వం దారుణంగా వేధించబట్టే, వారు తెలంగాణకు వెళ్లిపోయారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ రెడ్డి దెబ్బకు ఎఫ్డీఐల ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి దిగజారిందని పేర్కొన్నారు.


ఏపీలో కప్పం కట్టలేకనే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నామని పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే చెబుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ జగన్ దెబ్బకు పొరుగురాష్ట్రాల బాట పడుతుంటే, ఆయన సొంత కంపెనీలు, బినామీల కంపెనీలు మాత్రం దేదీప్యమానంగా కళకళలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఏపీ సీఎం తీరుతో రాష్ట్ర పారిశ్రామికవేత్తలు ఆయనకు దండం పెడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మిక్కిలి సంతోషంతో నిత్యం జగన్ రెడ్డి ఫోటోకు నమస్కరిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్‌తో పోటీపడ్డ ఏపీ.. జగన్ జమానాలో దేశంలోనే అథమస్థానానికి చేరి 14వ స్థానానికి దిగజారిందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 2014- 19 మధ్య 237 భారీ, మధ్యతరహా పరిశ్రమలు రూ.62,523 కోట్ల పెట్టుబడులు పెట్టాయని, దాదాపు 93,200 మందికి ఉపాధి కల్పించామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.35 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని, 33,500 మందికి మాత్రమే ఉపాధి కల్పించారని తెలిపారు.


టీడీపీ హయాంలో విశాఖపట్నంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన లులూ గ్రూప్.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరప్రదేశ్‌కు తరలిపోయిందని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. జాకీ సంస్థ కూడా వైసీపీ ప్రభుత్వ వేధింపులు, స్థానిక ప్రజాప్రతినిధుల దోపిడీ తట్టుకోలేకే ఏపీకి గుడ్ బై చెప్పిందన్నారు. కియా పరిశ్రమను చంద్రబాబు అనంతపురంలో ఏర్పాటుచేస్తే, సదరు సంస్థ అనుబంధ పరిశ్రమలు మాత్రం ఏపీకి రాకుండా తమిళనాడుకి తరలిపోయాయని ధూళిపాళ్ల వివరించారు. ఏపీలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్‌ బినామీలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాల్సి ఉందని ధ్వజమెత్తారు. ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవాల్సిందేనని మండిపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com