ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాన్ మస్క్ పై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆగ్రహం

international |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:06 AM

తన నిర్ణయాలతోనే కాదు తనదైన వ్యాఖ్యలు చేసి ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఉక్రెయిన్ల విమర్శలకు గురవుతున్నారు.  అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడిని ముగించాలని మస్క్ చేసిన ప్రతిపాదనను విమర్శించిన జెలెన్‌స్కీ.. వాస్తవాలు తెలియాలంటే తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. రష్యా ఆక్రమిత ఉక్రేనియన్ ప్రాంతాలలో ఐరాస పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ, క్రిమియా ద్వీపకల్పంపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించడం, ఉక్రెయిన్‌కు తటస్థంగా వంటి శాంతి సూచనలు చేస్తూ అక్టోబరులో మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


తాజాగా, న్యూయార్క్ టైమ్స్ బుధవారం ఏర్పాటుచేసిన డీల్‌బుక్ సదస్సులో జెలెన్‌స్కీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మస్క్‌ ప్రతిపాదనపై మరోసారి ఆయన మండిపడ్డారు. ‘‘ఎవరైనా అతనిపై ప్రభావం చూపుతున్నారని నేను అనుకుంటున్నాను లేదా అతను ఏదో ఒకవిధంగా తనంతట తానుగా తీర్మానాలు చేస్తాడా.. మా దేశంలో రష్యా ఏం చేస్తుందో అర్ధం చేసుకోవాలనుకుంటే ఉక్రెయిన్ వచ్చి మీ కళ్లతో మీరే చూడండి.. ఆపై ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలో.. ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ముగించవచ్చో మీరే చెబుతారు’’ అని మస్క్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.


అప్పట్లో మస్క్ ట్వీట్‌కు స్పందించిన జెలెన్‌స్కీ మీకు ఏది ఇష్టం.. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నారా? రష్యాకు మద్దతిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. దీంతో మస్క్ ఇరుకునపడ్డారు. తాజాగా మళ్లీ ఇదే అంశాన్ని జెలెన్‌స్కీ ప్రస్తావించారు. కాగా, ఉక్రెయిన్ ప్రాంతం ఖెర్సొన్ నుంచి రష్యా ఇటీవలే వెనక్కి వెళ్లింది. దీంతో ఖెర్సొన్‌ ప్రజలు ఆనందంగా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తొమ్మిది నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు లభించిన విజయాల్లో ఇదే కీలకం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com