హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటుంది. ఓ వైపు నగరం వేగంగా అభివృద్ధి జరుగుతుంటే.. మరోవైపు ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో పలు ఏరియాల్లో కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించారు. ఇక నిత్యం రద్దీగా ఉండే ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి గచ్చిబౌలి-కొండాపూర్ మధ్య ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
రూ.178 కోట్ల అంచనా వ్యయంతో గచ్చిబౌలి జంక్షన్ రెండవ లెవల్ క్రాసింగ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ వైపు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద జీహెచ్‌ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తోంది. ఫ్లైఓవర్ పొడవు 1.2 కి.మీ కాగా.. వెడల్పు 24 మీటర్లు. ఈ ప్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది. హైటెక్ సిటీ -ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ కూడా పెరగనుంది. తాజాగా.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ ఇలంబర్తి శేరిలింగంపల్లి జోన్‌లో పర్యటించారు.
గచ్బిబౌలిలో నూతనంగా నిర్మిస్తున్న శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ఫేజ్ 2 పనులను హెచ్‌ఎండీఏ కమీషనర్ సర్పరాజ్ అహ్మద్‌లతో కలిసి పరిశీలించారు. ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ వరకు పనులను, విస్తరించాల్సిన రోడ్లు, తొలగించాల్సిన విద్యుత్ స్తంభాలపై చర్చించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మరింత వేగవంతం పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. నిత్యం ట్రాఫిక్ ఉండే కీలక రహదారిపై ఈ పనులు జరుగుతున్నందున జాప్యం ఉండొద్దన్నారు. కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. రహదారి విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, కేబుళ్ల మార్పులో సంబంధిత శాఖ నుంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ త్వరగా పూర్యయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు, సర్వీసు రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైఓవర్లు, రహదారులు అందుబాటులోకి వస్తే వాహనాదారులు ట్రాఫిక్ టెన్షన్ లేకుండా ప్రయాణాలు చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.