తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉండటంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో స్మార్ట్ షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూ ఆల్స్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ కంపెనీ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ మేరకు గిగా ఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు. షూ అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు తయారు చేస్తామని.. పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఈ స్మార్ట్ షూ ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పారు.
తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో 750 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. షూ కంపెనీ ప్రతినిధుల ప్రతిపాదనకు మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. షూఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారీ షూ కంపెనీ తెలంగాణలో నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు స్మార్ట్ షూ సరఫరా చేస్తారని వివరించారు. షూ తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ఇక్కడ ట్యానరీలు అవసరమవుతాయని చెప్పారు. ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక తెలంగాణలో వేల మందికి ఉపాధి దొరుకుంన్నారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణ ఒక హబ్‌గా మారుతుందని వెల్లడించారు. ఇక స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని మంత్రి శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణలోని టైర్ II, టైర్ III నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను తాము పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.