తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన డీఎస్‌సీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్ 30) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. పరీక్షలు నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. అయితే ఈ డీఎస్సీ ఫలితాల్లో తండ్రీకొడుకులు సత్తా చాటారు. జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించి ఉద్యోగానికి దాదాపు అర్హత సాధించారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు జిల్లా స్థాయిలో టాప్ 10 లోపు ర్యాంకులు సాధించారు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల జంపుల గోపాల్ స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు DSC పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీలకు మరో ఐదేళ్లు వయో పరిమితి సడలింపు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించటమే లక్ష్యంగా గోపాల్ డీఎస్సీ పరీక్షలు రాశాడు. పరీక్షల్లో సత్తాచాటి తెలుగు పండిట్ కేటగిరిలో జిల్లాస్థాయిలోనే మొదటి ర్యాంకు సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందాడు.
ఆయన కుమారుడు భానుప్రకాశ్ సైతం డీఎస్సీ పరీక్షలు రాయగా.. నారాయణపేట జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ గణితంలో 9వ ర్యాంకు సాధించారు. దీంతో గోపాల్ ఇంట్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందం డబుల్ అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రీకుమారులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నారు. ఇక ఇదే జిల్లా కోస్గి మండలం ముక్తిపహాడ్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సైతం డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటారు. గ్రామానికి చెందిన ఈడ్గి కృష్ణయ్య స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంకు సాధించాడు. ఆయన సోదరుడు ఈడ్గి రమేశ్ ఎస్‌జీటీ విభాగంలో జిల్లాలో 11వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగం సాధించిన వారికి నియామకపత్రాలు అందజేయనున్నారు.