హైదరాబాద్ నగరవాసులు ప్రస్తుతం బుల్డోజర్ శబ్దం విన్నా.. కాలనీల్లో జేసీబీలను చూసినా వణికిపోతున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలకు సమీపంలో ఉండే ఇళ్ల యజమానులకైతే నిద్ర కూడా పట్టటం లేదు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండటంతో వారి గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తాజాగా.. నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారికి కొత్త భయం పట్టుకుంది. ఆర్బీ-ఎక్స్ గుర్తు చూస్తే చాలా ఆయా ప్రాంతాల్లోని నగరవాసులు వణికిపోతున్నారు.
మూసీని రివర్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించటంతో పాటు ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలకు కొత్త రూపు తీసుకురానున్నారు. ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకున్న మూసీలో మంచి నీరు పారేలా.. చేసేందుకు రేవంత్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మి్ంచిన ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సర్వే నిర్వించి.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పునరావసం కల్పించాలని భావిస్తున్నారు. తాజాగా రెవెన్యూ అధికారులు మూసీ పరివాహకం ప్రాంతాల్లో ఉండే ఇండ్లకు ఆర్బీ-ఎక్స్ అనే గుర్తును వేస్తున్నారు. సర్వే నిర్వహించి ఆయా ఇండ్లకు ఈ గుర్తును వేస్తున్నారు.
అధికారులు సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇండ్లకు ఆర్బీ-ఎక్స్ పేరుతో గుర్తును వేస్తున్నారు. ఆర్బీ-ఎక్స్ అంటే రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్. అంటే పునరావాసం కల్పించాల్సిన ఇల్లు అని ఆ గుర్తు అర్థం. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్ పరిధిని సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించి ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఇప్పటికే జీఓ సైతం జారీ చేసింది. అయితే ఆయా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి అలాంటి ఇళ్లపై ఆర్బీ-ఎక్స్ అని రాస్తున్నారు.
ప్రస్తుతం ఈ గుర్తును చూస్తే చాలు మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని నగర ప్రజలు వణికపోతున్నారు. ఇండ్లను కూల్చి.. తమను ఇక్కడి నుంచి తరలిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా గుర్తులు వేసి.. పోలీస్ బందోబస్తుతో తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.