ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గుడిహత్నూర్ మండలం మేకలగండి కార్నర్ సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మరో నలుగురు గాయపడగా.. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రక్త సంబంధికులు నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లా్రు.
ఓ కార్యక్రమం నిమత్తం అక్కడకు వెళ్లి వారు అర్ధరాత్రి తర్వాత తిరుగు పయనమయ్యారు. ఆదిలాబాద్ వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు మేకలగండి సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపైనే ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మొయిజ్ (60), ఖాజా మొయినుద్దీన్ (40), మహమ్మద్ ఉస్మానుద్దీన్ (11), అలీ(8) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ ఫరీద్ (12) రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. డ్రైవర్‌తో సహా తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం గాయపడిన వారికి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌లో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయని స్థానికులు అంటున్నారు. గత ఏడాది క్రితం ఓ కుటుంబం కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.
గుడిహత్నూర్ నుండి సీతాగొంది వరకు కొండ ప్రాతం డౌన్ లెవెల్‌లో ఉంటుందని.. దీంతో చాలా మంది తమ వాహనాలు న్యూట్రల్ చేసుకొని ప్రయాణాలు చేస్తుంటారని.. ఈ క్రమంలోనే వాహనాలు కంట్రోల్ తప్పి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.