హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో ప్రస్తుతం ఫ్రీ పార్కింగ్ ఉండగా.. దాన్ని ఎత్తేసి.. ఫీజు వసూలు చేసేందుకు మెట్రో యాజమాన్యం సిద్ధమైంది. ఈనెల 6 నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రకటించారు. నామమాత్రపు రుసుముతో పార్కింగ్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. మెట్రో ప్రకటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పెట్టిన పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయడమేంటని అధికారులను నిలదీస్తున్నారు. ఈ మేరకు మెట్రో ప్రయాణికులు నిరసనలకు సిద్ధమవుతున్నారు.
మెట్రో పార్కింగ్ ఫీజు విషయమై గత కొతం కాలంగా చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఫీజులు వసూలు చేయాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా పార్కింగ్ ఫీజులు మళ్లీ అమలు చేసేందుకు మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మియాపూర్-ఎల్‌బీనగర్, నాగోలు-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ మెుత్తం మూడ కారిడార్ల పరిధిలో 57 స్టేషన్లు ఉన్నాయి. వీటిల్లో 10 స్టేషన్లలో మాత్రమే ఉచిత పార్కింగ్ సదుపాయం ఇంది. మిగతా 47 స్టేషన్లలో చాలా కాలంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎల్‌బీ నగర్, మూసారంబాగ్, నాగోల్, రసూల్‌పురా, ఎర్రమంజిల్, పంజాగుట్ట, బాలానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ స్టేషన్లకు సమీపంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉండడంతో ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఈ పార్కింగ్ స్థలాలు ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతను అందిస్తాయిని చెప్పారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు ప్రత్యేక పార్కింగ్ ఉంటుందన్నారు.
కాగా, ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో టూవీలర్లకు రెండు గంటలకు రూ. 10, 2 నుంచి 3 గంటలకు రూ.15, 3 నుంచి 4 గంటలకు రూ. 20, 4 నుంచి 12 గంటలకు రూ.25 పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. 4 వీలర్ అయితే రెండు గంటలకు రూ. 30, 2-3 గంటలకు రూ.45, 3-4 గంటలకు రూ. 60, 4-12 గంటల వరకు రూ.75, తర్వాత అదనపు గంటలను బట్టి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇవే ఛార్జులు ప్రస్తుతం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఫీజుల వసూళ్లపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.