తెలంగాణలో జంగిల్ సఫారీ అనుభవం పొందాలనుకునే వారికి తీపి కబురు. అమ్రాబాద్ (నల్లమల) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జంగిల్ సఫారీ మళ్లీ ప్రారంభమైంది. గత మూడు నెలలుగా మూతపడిన జంగిల్ సఫారీ నేటి నుంచి ప్రారంభమైంది. అటవీ జంతువుల ప్రత్యుత్పత్తి కాలం కారణంగా ఫారెస్ట్ అధికారులు జంగిల్ సఫారీని నిలిపేసిన సంగతి తెలిసిందే. సఫారీ కోసం వచ్చే వారికి ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ చేయాలనుకునే వారు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. www.amrabaadtigerreserve.com వెబ్‌సైట్‌లో ప్యాకేజీని బుక్ చేసుకోచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇద్దరు వ్యక్తులకు కాటేజీని బట్టి రూ. 5,100-రూ. 8,500 వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
స్టాండర్డ్ రూం రూ. 5,100, చీతల్ డార్మెట్రీ రూ. 6,500, మడ్ హౌజ్ రూ. 7,000, ఫర్హ ట్రీ హౌజ్, చెంచు హట్ రూ. 7,500, రూ. 8,500 చొప్పున ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో కాటేజీలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుంది. నలుగురు ఉండాలంటే మాత్రం రూ.20 వేల ప్యాకేజీ తీసుకోవాలి. ఎనిమిది మందికి రూ. 40 వేల ప్యాకేజీ అందుబాటులో ఉంచారు. ఈ ప్యాకేజీలలో జంగిల్ సఫారీ, రాత్రి కాటేజీ బస, ఉదయం ట్రెక్కింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఫుడ్ ఖర్చును పూర్తిగా టూరిస్ట్‌లే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ ప్యాకేజీ బుక్ చేసుకున్న టూరిస్టులు మధ్యాహ్నం 12 గంటలకు మన్ననూరు చెక్‌పోస్ట్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మధ్యాహ్నం 3 తర్వాత సఫారీ టూర్ ప్రారంభం అవుతుంది. గుండం బేస్ క్యాంప్ మీదుగా అడవిలో ప్రత్యేక వాహనంలో తిప్పుతారు. అక్కడ చిరుతలు, పెద్ద పులులు, సాంబార్ జింకలు, వివిధ రకాల జంతువులు, పాములను దగ్గర్నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫర్హాబాద్ వ్యూ పాయింట్ నుంచి నల్లమల నలుదిక్కులనూ ఆస్వాదించొచ్చు. రాత్రి 7.30 నుంచి 8 గంటల మధ్య తిరిగి మన్ననూర్ చేర్చనున్నారు.
మన్ననూర్‌లో చెంచుల జీవనవిధానంతో అడవికి సంబంధించిన పలు విషయాలపై ఫారెస్ట్ అధికారులు, చెంచులు అవగాహన కల్పిస్తారు. రాత్రి కాటేజీ బస తర్వాత ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి ఉదయం 6 గంటలకు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్తారు. మన్ననూరు నుంచి ఉమామహేశ్వరం వరకు ఒక రూట్, మన్ననూరు నుంచి ప్రతాపరుద్రుని కోట వరకు మరో రూట్‌లో టూరిస్టులను ట్రెక్కింగ్‌కు తీసుకెళ్తారు. తర్వాత ఉదయం 10 గంటలకు ఫారెస్ట్ చెక్ అవుట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి ప్యాకేజీ కాకుండా ఫారెస్ట్ సఫారీకి మాత్రమే వెళ్లాలనుకునే టూరిస్టులు డైరెక్ట్‌గా ఫర్హాబాద్ వ్యూపాయింట్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్లి తర్వాత తిరిగి వారిని వ్యూ పాయింట్ వద్ద వదిలేస్తారు.