ఉద్యోగ నియామకాల కోసం రూపొందించిన జాబ్ క్యాలెండర్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీలో ఈ వివరాలను ప్రకటించనున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ప్రతిపక్ష నేతలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.జీవో 317, జీవో 46, 2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో చర్చలు జరిపిందన్నారు.వీటికి సంబంధించిన విదివిధానాల రూపకల్పన కోసం ముగ్గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఉంటారని వెల్లడించారు.