ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ వరద నీరు ఘటనలో తెలంగాణ సింగరేణి అధికారి కుమార్తె మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 10:19 PM

కుండపోత వర్షాలతో ఢిల్లీ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో ఇండ్లు, అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు చేరాయి. ఈ క్రమంలోనే.. ఓల్డ్ రాజేందర్ నగర్‌లో పలు అపార్ట్‌మెంట్లలోని బేస్‌మెంట్లలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లలోకి నీళ్లు చేరాయి. ఈ నేపథ్యంలోనే రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ఒక్కసారిగా వరద పోటెత్తగా.. అందులో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు బలయ్యారు. శనివారం రాత్రి 7 గంటలకు గ్రౌండ్ ఫ్లోర్‌లోకి భారీగా వరద నీరు చేరగా.. అందులో పలువురు సివిల్స్ అభ్యర్థులు చిక్కుకున్నారన్న సమాచారంతో రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి 13 మందిని సురక్షితంగా కాపాడారు. అయితే.. ముగ్గురు విద్యార్థులు మాత్రం వరద నీటిలో చిక్కుకుని.. బయటికి రాలేక ప్రాణాలు వదిలారు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు బయటికి తీశారు. అందులో యూపీ, కేరళకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండగా.. తెలంగాణకు చెందిన యువతి కూడా ఉండటం బాధాకరం.


 ఇప్పటికీ బేస్మెంట్‌లో ఇంకా 7 అడుగుల లోతు వరద నీరు ఉందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రావుస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్‌ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సివిల్స్ అభ్యర్థులు పెద్దఎత్తున రోడ్లపై నిరసనలు ప్రదర్శిస్తున్నారు.


ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఇప్పటికే పలు సెక్షన్ల కింద రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషనలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ చేపట్టామని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు ఎం.హార్షవర్ధన్‌ తెలిపారు. మృతిచెందిన వారు తెలంగాణ సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని (25), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌‌కు చెందిన శ్రేయా యాదవ్ (25), కేరళలోని ఎర్నాకులానికి చెందిన నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. తానియా సోని స్వస్థలం బీహార్ కాగా.. ఆమె తండ్రి విజయ్ కుమార్ తెలంగాణ సింగరేణిలో.. శ్రీరాంపూర్-1 భూగర్భగని మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనలో మంచిర్యాలకు చెందిన తానియా సోని (25) మృతి చెందగా.. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా సికింద్రాబాద్ చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com