తెలంగాణ వాతావరణంలో ఈసారి విభిన్న వాతావరణం నెలకొని ఉంది. మే నెలలో ఎండలు దంచికొట్టాల్సి ఉండగా.. అనుహ్యంగా వర్షాలు కురిశాయి. ఇక జూన్ నెలలో వర్షాలు కురువాల్సి ఉండగా.. ఎండలు కాస్తున్నాయి. జూన్ మెుదటి వారంలోనే నైరుతి రుతపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా.. ఇప్పటికీ ఆశించినంతగా వర్షాలు కురవటం లేదు. విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయి. అయితే నేటి వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
అధికారులు వెల్లడించిన ప్రకారం.. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. నేడు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనూ వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్‌లో పగలు ఎండ కాసినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.