తెలంగాణ రాష్ట్రంలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంబించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. జాతికి అంకితం చేశారు. నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న బాహుబలి మోటర్లను ఆన్ చేసి.. కృష్ణా జలాల ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి.. జలహారతి పట్టారు.
ఈ బృహత్తర కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, స్మితా సబర్వాల్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీటిని అందించాలన్న లక్ష్యంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిందారు. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో ఈ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగు నీరు, రెండో దశలో సాగు నీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ప్రభుత్వం. అందులో భాగంగా.. ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకున్నాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు.