ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవీ నరసింహారావుకే గురువు నూకల రాంచంద్రా రెడ్డి...కేసీఆర్ వ్యాఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 11:52 PM

ఎంతో మందికి గురువు పీవీ నరసింహారావు. కానీ.. పీవీ నరసింహారావుకు గురువు నూకల రాంచంద్రా రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మహబూబాబాద్ గడ్డపై పుట్టిన నూకల రాంచంద్రారెడ్డి గురించి కేసీఆర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నూకల రాంచంద్రారెడ్డి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురువు అని తెలిపారు. అయితే.. పీవీ నరసింహారావులో ఉన్న తేజస్సును ముందుగా గుర్తించింది నూకల రాంచంద్రారెడ్డేనని కేసీఆర్ తెలిపారు. అయితే.. ఒకనొక సమయంలో నూకల రాంచంద్రరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పీవీకి ఇవ్వకపోవటంపై అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. పీవీకి మంత్రి పదవి ఇస్తేనే తనకు ఇవ్వాలని లేకపోతే తనకు కూడా అవసరం లేదని పట్టుపట్టి.. ఇద్దరూ ఒకేసారి మంత్రి పదవి స్పీకరించారని పేర్కొన్నారు. అయితే.. పీవీలో స్పార్క్ ఉందని.. భవిష్యత్తులో గొప్ప వ్యక్తి అవుతారని ముందుగా గుర్తించింది నూకల రాంచంద్రరెడ్డేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ గురించి ఎంతో తపన పడ్డారని.. పోరాడారని తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరాన్ని ప్రారంభించి.. తెలంగాణ కోసం చాలా కృషి చేశారని తెలిపారు.


"ఈ గడ్డ మామూలు గడ్డ కాదు. నూకర రాంచంద్రారెడ్డి పుట్టిన గడ్డ. ఆయన ఎంత మహానుభావుడో చాలా మందికి తెలియదు. తెలంగాణ కోసం తపించారు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం పెట్టారు. అయితే.. ఎంతో మందికి గురువు పీవీ నరసింహారావు. కానీ.. పీవీ నరసింహారావుకు గురువు నూకల రాంచంద్రా రెడ్డి. అటు ప్రతిపక్షంలో ఉన్నా.. ఇటు అధికారంలో ఉన్న అద్భుతంగా పని చేసిన వ్యక్తి.. అత్యంత ప్రతిభ ఉన్న మహానుభావుడు. ఓసారి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పీవీకి ఇవ్వకపోతే... నేను తీసుకోను అని చెప్పారు. ఎందుకు తీసుకోవని అడిగితే.. పీవీలో స్పార్క్ ఉంది.. భవిష్యత్తులో గొప్ప నాయకుడవుతాడు.. ఇతన్ని ఇక్కడే చిదిమేయకండి అని నూకల రాంచంద్రారెడ్డి తెలిపారు. ఇద్దరికి ఒకసారి ఇస్తేనే తీసుకున్న గొప్ప వ్యక్తి. ఆయన దీవెనతోని పీవీ నర్సింహారావు ఎంత ఎత్తుకు ఎదిగారో అందరూ చూశారు. భారతదేశానికే ప్రధాని అయిన పరిస్థితి మనం చూశాం. అంత పటిష్టమైన ఆలోచన, అంత ముందు చూపు ఉన్న దీర్ఘదర్శి మహనీయుడు నూకల రాంచంద్రారెడ్డి." అంటూ పీవీ గురువు గురించి సభ వేదికపై ప్రస్తావించారు కేసీఆర్.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com