ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్దుల మామయ్య విదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:09 AM

ముద్దుల మామయ్య విదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు అంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. మాటిస్తే మడమ తిప్పం అన్న వ్యక్తులు విదేశాల్లో తిరుగుతున్నారని జగన్‌పై జనసేనాని సెటైర్లు వేశారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసమే తాము జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జనవాణి కార్యక్రమంలో రైతుల సమస్యలు, టిడ్కో ఇళ్ల సమస్యలు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయన్నారు. టిడ్కో ఇళ్ల కోసం లక్ష రూపాయల వరకూ డబ్బు కట్టించుకున్నారని.. దేవుడు వరం ఇచ్చినా.. పూజారి కరుణించనట్లుగా పరిస్థితి తయారైందన్నారు. ‘ఓవైపు సీఎం జగన్ తనను మావయ్య అని పిలవాలని విద్యార్థులను అంటున్నారు. కానీ ముద్దుల మామయ్య విదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. విద్యార్థులకు జగన్ సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్టడం లేద’ని పవన్ ఆరోపించారు. విదేశీ విద్యాపథకం కింద అందాల్సిన సాయం ఆగిపోయిందన్నారు.


ఆటోడ్రైవర్లకు జగన్ సర్కారు ఏడాదికి పది వేలు ఇస్తోంది కానీ వాళ్లు తిరిగి ఇచ్చేదే ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొందరు ఆటో డ్రైవర్లు రూ.20 వేలు చలాన్లు కట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. బోరు బావులకు మీటర్లు పెడుతుంటే వ్యవసాయం ఎలా చేయాలని రైతులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వం కాలుష్య సమస్యపై దృష్టి సారించడం లేదన్న జనసేనాని.. విజయవాడలో ఇంత పొల్యూషన్ క్రియేట్ చేసే పరిశ్రమలు ఉన్నాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఓ కాలనీలో ఐదడుగుల లోతు తవ్వితే మురికి నీరు వస్తోందన్నారు.


151 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్న పవన్ కళ్యాణ్.. జనవాణి కార్యక్రమానికి వస్తున్న స్పందన ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. జనవాణిలో భాగంగా తమ గోడు చెప్పుకోవడానికి ఇంకా చాలా మంది బయట వేచి ఉన్నారన్నారు. ప్రజా సమస్యలను తీర్చడం కోసం ప్రభుత్వం ‘స్పందన’ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికీ కొన్ని లక్షల మంది సమస్యలతో బాధపడుతున్నారన్నారు. నిజంగా స్పందన కార్యక్రమం విజయవంతమైతే.. ఇంత మంది జనం తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చేవారు కాదన్నారు.


తాను కాపు కులానికి చెందిన వ్యక్తిననే కారణంతో జగన్ తనను కాపులతో తిట్టుస్తున్నారని పవన్ ఆరోపించారు. ఏ కులంలో పుట్టినా విశ్వ నరుడిగా ఎదగాలన్నారు. సీఎం జగన్ కాపులకు విపరీతమైన ద్రోహం చేస్తున్నారని నాకు విజ్ఞాపనలు అందాయన్నారు. ముస్లిం సమాజంపట్ల కూడా జగన్ అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన 27 పథకాలను తొలగించారని తను విజ్ఞాపనలు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయమై వైఎస్సార్సీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు, దళిత మేధావులు ఆలోచించాలన్నారు.


ప్రజలను కౌగిలించుకోను.. ప్రజలను ముద్దును పెట్టుకోను.. అమ్మ, చెల్లి అంటూ ప్రేమ పూర్వకంగా మాట్లాడను. రాజ్యాంగ ప్రకారం మీకు వచ్చే హక్కుల కోసం పోరాడతాను. ముద్దులు పెట్టే వాళ్లను తాను నమ్మనన్న పవన్ కళ్యాణ్.. మనం నమ్మకూడదన్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించే ఓపిక మన ప్రజాప్రతినిధులకు ఎందుకు లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.


రంజాన్ రాగానే ముస్లిం టోపీలు పెట్టుకొని హలయ్ భలాయ్‌లు ఇవ్వడం కాదు.. మీ సమస్యల పరిష్కారం తనకు ముఖ్యమన్నారు. నా నుంచి ప్రజలు అద్భుతాలు ఆశించొద్దన్న పవన్.. తాను ముద్దుల మావయ్య కాదన్నారు. తాను ప్రజల సమస్యలను పది మంది దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతి చిన్న సమస్యను మాకు తెలియజేస్తే పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. కొద్ది మంది సమస్యలను కూడా ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఎక్కువ మందికి తెలిసేలా చేస్తానని జనసేనాని తెలిపారు. ఏపీకి వనరులు తక్కువన్న పవన్ కళ్యాణ్.. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్ల రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందన్నారు. సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు.


ఈ పని చేస్తే మాకు ఎన్ని ఓట్లు వస్తాయని వైసీపీ భావిస్తే.. ఈ పని చేస్తే జనాల జీవితాలు ఎంత బాగుపడతాయని జనసేన ఆలోచిస్తుందన్నారు. జనసేనకు, వైసీపీకి ఇదే తేడా అని పవన్ తెలిపారు. అధికారం సంగతి పక్కనబెడితే.. మనం ఉన్నామని ప్రజలకు భరోసా ఇస్తే.. ఓటు అడిగే హక్కు మనకు ఉంటుందన్నారు. ప్రజలు తమను గెలిపిస్తే బాధ్యతతో కూడిన పరిపాలన అందిస్తామన్నారు. తప్పు చేసినోడి తోలు తీసేలా లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ అనేది హానికరం అన్న పవన్ కళ్యాణ్.. ఆ పార్టీలోనూ మంచి నేతలున్నారని.. కానీ వారిని పని చేయనివ్వరన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com