ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణసీమగా మారిన కోనసీమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 05:10 PM

గోదావరి జిల్లాలు అనగానే పచ్చని పైర్లు గుర్తుకువస్తాయి.ప్రశాంత వాతావరణం కళ్లముందు కదలాడుతుంది. పచ్చని పంట పొలాల కళకళలాడే గోదావరి జిల్లాల ప్రజలకు వెటకారమే తప్ప కోపమే ఉండదంటారు. ఈ ప్రాంతంలో గొడవలు, అల్లర్లు చాలా తక్కువ. అలాంటి గోదావరి మలమలా మాడుతోంది.అమలాపురం అగ్ని గుండమైంది. కోనసీమ వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.


జిల్లా పేరు చిచ్చుతో అమలాపురం భగ్గుమంది. వేలాది మంది నిరసనకారులు కొన్ని గంటల పాటు అమలాపురంలో సైర్వవిహారం చేశారు. బస్సులను దగ్ధం చేశారు. ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. పోలీసులపైనా తిరగబడ్డారు. నిరసనకారుల దాడిలో అమలాపురం జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో పాటు అనేక మంది పోలీసులు గాయపడ్డారు. కొత్తగా అమలాపురం కేంద్రంగా ఏర్పడిన జిల్లా పేరు వివాదమే ఇంతటి విధ్వంసానికి కారణమైంది.


అయితే.. పచ్చటి, ప్రశాంత కోనసీమలో రాష్ట్ర ప్రభుత్వం చిచ్చురేపిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా పేరుపై అన్ని ఆందోళనలూ సద్దుమణిగి ప్రశాంతత నెలకొన్న వేళ.. ఊహించని రీతిలో తీసుకున్న నిర్ణయం గొడవలకు ఆజ్యం పోసింది. అమలాపురంలో మంగళవారం జరిగిన ముట్టడి రణరంగం కావడానికి సర్కారు నిర్ణయమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాల విభజన సమయంలో కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని పార్టీలకు అతీతంగా ఆందోళనలు జరిగాయి. దళిత సంఘాలు ఉద్యమం చేపట్టాయి. కానీ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.


ఆ తర్వాత ఆందోళనలు సద్దుమణిగాయి. కానీ అనూహ్యంగా ఈ నెల 18న ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఒక వర్గం సంబరాలు చేసుకోగా, మరో సామాజికవర్గం ఆందోళనలకు దిగింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఉద్యమానికి సిద్ధమైంది. అదే సమయంలో ఈ నెల 19న తెల్లవారుజామున అయినవిల్లి మండలం శానపల్లి లంకగ్రామంలో స్థానిక ప్రజలు, కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. జగన్ దిష్టిబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించడం కలకలం రేపింది.


20వ తేదీన కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలాపురం కలెక్టరేట్ ముట్టడికి పిలుపిస్తే 5 వేల మంది వరకు తరలివచ్చారు. అమలాపురం యువకుడు అన్యం సాయి అనే యువకుడు పెట్రోలు పోసుకుని ఆత్మహత ప్రయత్నించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త. మంత్రి విశ్వరూప్ కు అనుచరుడు కూడా. ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు. అంబేడ్కర్ పేరు మార్చాలన్న ఉద్యమంలో ఇతడు కీలక పాత్ర పోషించడం వైసీపీ నేతల పాత్రపై అనుమానాలు కలిగిస్తోంది.


దీనికితోడు కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలంటూ ఆందోళనలు చేసేవారిని పోలీసులు 20వ తేదీ నుంచి ఎక్కడికక్కడ అరెస్టు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలు పునిచ్చింది. కానీ పోలీసులు 144 సెక్షన్ పెట్టి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన జేఏసీ... మళ్లీ మంగళవారం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా పేరు మార్పునకు సంబంధించిన అభ్యంతరాలతో పెద్దఎత్తున వినతి పత్రాలివ్వాలని పిలుపిచ్చింది. దీంతో పోలీసులు అమలాపుర మంతటా 144 సెక్షన్ విధించారు. పట్టణంలో బారికేడ్లు, ఇనుపకంచెలు వేశారు. కోనసీమలోని నేతలను గృహ నిర్బంధం చేశారు.


దీంతో వారి కార్యక్రమం విఫలమైందని పోలీసులు భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా విధ్వంసకాండ చెలరేగింది. అమలాపురానికి వచ్చే అన్నిదారులనూ వారు మూసేసినా వేల మంది ఆందోళనకారులు ఎలా వచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని హోటళ్లు, లాడ్జిల్లో ముందుగానే కొందరు బస చేసి.. అదను చూసి రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. కొందరు వైసీపీ నేతల కనుసన్నల్లోనే హింసాకాండ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.


అయితే.. దాదాపు 6 గంటల పాటు సాగిన విధ్వంసకాండతో కోనసీమ చిగురుటాకులా వణికిపోయింది. 2016లో జరిగిన తుని ఘటనతో.. ఈ పరిణామాలను పోలుస్తున్నారు గోదావరి ప్రజలు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com