ఉక్రెయిన్ పై దాడికి పాల్ప డుతున్నా రష్యా ఆ దేశంలోని అమాయక ప్రజలను టార్గెట్ చేస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా.. అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తోంది. అమాయక ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ వారి ఉసురు పోసుకుంటున్నారు రష్యన్ సైనికులు. ఇలా మాస్కో సేనల అమానుషానికి సోదరులను కోల్పోయి, మృత్యువు నుంచి బయటపడిన ఓ బాధితుడు తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాడు. చిత్రహింసలకు గురిచేసిన రష్యా సైన్యం, చనిపోయి ఉంటాడని భావించి తనను గోతిలో పాతిపెట్టిందని, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగినట్లు మైకోలా కులిచెంకో అనే 33 ఏళ్ల వ్యక్తి చెప్పారు.
సీఎన్‌ఎస్ వార్తా సంస్థతో మైకోలా మాట్లాడుతూ.. దండయాత్ర ప్రారంభించిన మూడున్నర వారాల తర్వాత ఉత్తర చెర్నిహోవ్‌లోని డోవ్‌జైక్ గ్రామంపై రష్యా సైనికులు బాంబులతో దాడి చేశారు. మా ఇంట్లోకి చొరబడి సోదరులు యెవ్‌హెన్, దిమిత్రో సహా తమ ముగ్గురిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి సోదాలు జరిపారని పేర్కొన్నాడు. ఈ సమయంలో మా తాతకు చెందిన సైనిక పతకాలు, పారాట్రూపర్‌గా పనిచేస్తున్న యెవ్‌హెన్‌కు సంబంధించిన ఓ బ్యాగు ఇంట్లో లభించడంతో అనుమానించిన రష్యన్ సైన్యం.. తమను ఓ బేస్‌మెంట్‌లోపలికి తీసుకెళ్లిందని మైకోలా వివరించాడు.
‘బేస్‌మెంట్ లోపల మమ్మల్ని మూడు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు.. మాకేమీ తెలియదని ప్రాధేయపడ్డా వదలిపెట్టలేదు.. ఆ తర్వాతైనా వదిలేస్తారని భావించాం.. కానీ నాలుగో రోజున నోట్లో తుపాకీ పెట్టి ఓ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు.. ఈ దెబ్బలకు తాళలేక నా ఇద్దరు సోదరులు సృహకోల్పోయారు’ అని నాటి దాడిని కులిచెంకో గుర్తుచేసుకున్నారు. అంతటితో ఈ దురాగతం ఆగలేదని, తమ ముగ్గురి కళ్లకు గంతలు కట్టి, ఓ సైనిక వాహనంలో నిర్మానుష్య ప్రాంతానికి తరలించారని పేర్కొన్నాడు. అక్కడ తమను పాతిపెట్టి ప్రయత్నం చేసిందని ఆయన వెల్లడించారు.