ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ భారతీయ విద్యార్థుల భవిష్యత్ పై సుప్రీంకు కేంద్రం క్లరిటీ

international |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 04:10 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 26వ రోజుకు చేరుకుంది. మరింత తీవ్రతరం అవుతోంది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన యుద్ధం.. ఎడతెరిపినివ్వట్లేదు. రోజురోజుకూ మరింత ఉధృతం అవుతోంది. రష్యా సాగిస్తోన్న భీకరదాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముఖాముఖి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ కౌంటర్‌పార్ట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. అది విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు చర్చల వాతావరణాన్ని మరింత జఠిలం చేసినట్టయింది. ఈ యుద్ధం వల్లల భారత విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. వేలాదిమంది విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేసి, స్వదేశానికి చేరుకున్నారు. 22,500 మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఒకరు మరణించారు. కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప అనే వైద్య విద్యార్థి- రష్యా వైమానిక దాడుల్లో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం ఈ తెల్లవారు జామున బెంగళూరుకు చేరుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా పలువురు నివాళి అర్పించారు. భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. పౌర విమానాలతో పాటు వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌లను రంగంలోకి దించింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన హాలాండ్, పోలాండ్, రొమేనియా, మోల్డానో, స్లొవేకియా మీదుగా వారంతా భారత్‌కు వచ్చారు. వారంతా సురక్షితంగా స్వదేశానికి వచ్చినప్పటికీ- అసలు సమస్య అక్కడే మొదలైంది. విలువైన తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన ఆ విద్యార్థులందరి భవిష్యత్ ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టతను ఇచ్చింది. దేశీయ కళాశాలల్లో వారిని సర్దుబాటు చేసే దిశగా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఓ నివేదికను అందజేసింది. ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన విద్యార్థుల గురించి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో తెలియజేయాలంటూ సుప్రీంకోర్టులో పలు రిట్ పిటీషన్లు దాఖలయ్యాయి. ఉక్రెయిన్ ఒడెస్సాలోని నేషనల్ మెడికల్ యూనివర్శిటీ విద్యార్థిని ఫాతిమా అహానా సహా పలువురు ఈ పిటీషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం తన నివేదికను అందజేసింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ నివేదికను ధర్మాసనానికి ఇవ్వాళ అందజేశారు. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటిదాకా 22,500 మంది భారత విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చామని కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి వివరించారు. వారందరినీ దేశీయ కళాశాలల్లో సర్దుబాటు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలను తీసుకుందని అన్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం చేయదని చెప్పారు. వారి విద్యా సంవత్సరాన్ని కాపాడటానికి త్వరలోనే తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com