మూడు వారాలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా భీకర దాడులకు దిగుతోంది. తన అమ్ములపొదిలోని అత్యంత అధునాత కింజాల్ హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. వీటితో దాడి చేసి ఉక్రెయిన్లో ఆయుధాల నిల్వ స్థలాన్ని ధ్వంసం చేసింది. యుద్ధంలో ఇప్పటి వరకు కింజాల్ హైపర్సోనిక్ ఆయుధాలను వాడడం ఇదే తొలిసారి. హైపర్సోనిక్ ఏరోబాలిస్టిక్ క్షిపణులతో కూడిన కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని డెలియాటిన్ గ్రామంలో నిప్పులు కురిపించింది. విమానయాన ఆయుధ సామగ్రిని కలిగి ఉన్న పెద్ద భూగర్భ గిడ్డంగిని ధ్వంసం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కింజాల్ క్షిపణిని "ఆదర్శ ఆయుధం"గా అభివర్ణించారు. ఇది ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. అతి పెద్ద సైనిక ఆయుధ సంపత్తి కలిగిన తమతో ఉక్రెయిన్ పోరాడడం ఏ మాత్రం సహించలేకే రష్యా దూకుడుగా ముందుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు మరిన్ని తీవ్రతరమైన దాడులు చేస్తుందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.