ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 01:12 PM

పంజాబ్‌ సీఎంగా భగవంత్‌ సింగ్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజధాని చండీగఢ్‌లో కాకుండా భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కాడ్‌ కలన్‌లో పదవీ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2022, మార్చి 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రజలందర్నీ ఆహ్వానిస్తూ ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.


ఒక్క భగవంత్‌ సింగ్‌ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు.. మొత్తం 3 కోట్ల పంజాబీ ప్రజలు ముఖ్యమంత్రులు కానున్నారని ఆయన అన్నారు. అందరం కలిసికట్టుగా షహీద్‌ భగత్‌ సింగ్‌ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. మగవారంతా పసుపచ్చ తలపాగాలు ధరించాలని, మహిళలు అదే రంగు దుప్పట్టా వేసుకొని రావాలని కోరారు. పంజాబ్‌లో విజయోత్సాహంతో ఆప్‌ పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బెంగాల్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని, గ్రామ స్థాయిలో ఉనికి చాటుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 2014 నుంచే ఈ పార్టీ ఉన్నా ఇంతవరకు చెప్పుకోదగ్గ ప్రభావం చూపించలేదు.


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా. పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర సీఎంగా ఉన్న చరణ్ జీత్ సింగ్ చన్నీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు.


హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు కొనసాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో పరాజయాలు.. మరెన్నో విజయాలు ఉన్నాయి. అయితే ఓటములకు కుంగిపోని ఆయన.. గెలుపుతోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. గవంత్ మాన్ 1972 అక్టోబర్ 17న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సతోజ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు మోహిందర్ సింగ్, ఆయన ఉపాధ్యాయుడు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని SUS ప్రభుత్వ కళాశాలలో బీకామ్‌ చదివిన మాన్‌ ఇంద్రప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.


1992లో భగవంత్ మాన్ క్రియేటివ్ మ్యూజిక్ కంపెనీలో చేరి షోలు చేయడం ప్రారంభించారు. 2013 వరకు డిస్కోగ్రఫీ ఫిల్డ్‌లో చురుకుగా ఉన్నారు. మాన్ యూత్ కామెడీ ఫెస్టివల్, ఇంటర్ కాలేజీ పోటీలలో పాల్గొన్నారు. పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలోని షహీద్ ఉధమ్ సింగ్ ప్రభుత్వ కళాశాలలో రెండు బంగారు పతకాలు సాధించారు. 1994లో 'కచారి' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2018 వరకు 12కి పైగా సినిమాలు చేశారు. భగవంత్ మాన్ రాజకీయాలు, క్రీడలతో పాటు దేశంలోని అనేక సమస్యలపై కామెడీ షోలు చేశారు. 2012లో కొత్తగా ఏర్పడిన పంజాబ్ పీపుల్స్ పార్టీ నుంచి తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు మాన్. లెహ్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ పీపుల్స్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న మాన్.. 2014లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. భగవంత్ మాన్. సుఖ్‌దేవ్ సింగ్ ధిండాను ఓడించారు.


ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో భగవంత్ మాన్ సంగ్రూర్ నుంచి గెలుపొందారు. ఈసారి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భగవంత్ మాన్‌ను ఆప్ సీఎం అభ్యర్ధిగా నిర్ణయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న ఆయన కృషి ఫలించినట్లైంది..! పంజాబ్‌లో ఆప్‌కే పట్టం కట్టారు ప్రజలు. దీంతో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు మాన్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com