ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ భారీ విజయానికి 10 ముఖ్యమైన కారణాలివే

national |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 09:34 AM

యూపీలో బీజేపీ(BJP) విజయానికి కారణాలేంటి? సరికొత్తచరిత్ర సృష్టిస్తూ వరుసగా రెండోసారి అధికారంలోకి ఎలా రాగలిగింది?ఆ పార్టీకి కలిసివచ్చిన అంశాలేంటి? తోడుగా నిలిచిన సామాజిక వర్గాలేవి? మోదీ, యోగీ మ్యాజిక్ ఎలా రిపీట్ అయింది? అఖిలేష్ యాదవ్ ఈక్వేషన్స్‌ ఎక్కడ తప్పాయి? విపక్షాల మూకుమ్మడి వైఫల్యం.. కమల వికాసానికి మెట్లుగా ఉపయోగపడిన టాప్‌ 10 పాయింట్స్‌పై ఓ లుక్కేద్దాం..


ఆదుకున్న అయోధ్య రాముడు..


అంతా రామమయం.! బీజేపీ విజయంలో ఆయోధ్య రాముడిది చెప్పుకోదగ్గ పాత్రే ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదు.. రామాలయ నిర్మాణానికి అడుగులు పడటం.. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతుండటం.. కమలానికి కచ్చితంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో దాదాపు 80 శాతంగా ఉన్న హిందూ సమాజం.. రామాలయం నిర్మాణాన్ని సెంటిమెంట్‌గా భావించింది. ఆ సెంటిమెంట్‌ను ఓట్లుగా మార్చడంలో కాషాయదళం సక్సెస్ అయింది.


 


మోదీ, యోగీ, అమిత్‌షా వ్యూహాలు..


వాళ్ల స్కెచ్‌కు తిరుగుండదు.. బరిలోకి దిగితే ఎదురుండదు.. మోదీ-యోగీ-అమిత్‌షా వ్యూహాలు మళ్లీ వర్కౌట్ అయ్యాయి. మరోసారి యూపీ పీఠంపై కూర్చోబెట్టాయి. డబుల్ ఇంజిన్ మంత్రం బాగా పనిచేసింది. కేంద్రంలో మోదీ, యూపీలో యోగీ నినాదానికి జనాలు ఆమోదముద్ర వేశారు. మళ్లీ దీవించారు.


 


రైతు చట్టాల రద్దు కమలానికి పెద్ద బూస్ట్..


రైతు చట్టాలపై వెనక్కి తగ్గడం, స్వయంగా ప్రధాని మోదీ రైతులకు క్షమాపణలు చెప్పడం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన రైతులు మోదీ క్షమాపణలను స్వీకరించారు. మన్నించారు. అందుకే ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకే పట్టం కట్టారు.


 


ప్రభావం చూపని హథ్రాస్‌,ఉన్నావ్, లఖింపూర్‌ ఖేరీ ఘటనలు..


ఈ ఎన్నికల్లో బీజేపీపై ప్రతిపక్షాలు సంధించిన మూడు అంశాలు.. ఒకటి లఖింపూర్‌ ఖేరీ, రెండోది హథ్రాస్, ఇక మూడోది ఉన్నావ్. ఇవే ప్రధానాస్త్రాలుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ అయితే ఏకంగా బాధితులకే టికెట్లు ఇచ్చి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేసింది. కానీ కమలోత్సాహం ముందు అవన్నీ పటాపంచలయ్యాయి. ఈ మూడు చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది.


 


తేలిపోయిన రాహుల్‌- ప్రియాంక గాంధీ..


రాహుల్, ప్రియాంకాగాంధీ.. ఈ సెమీఫైనల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా ప్రియాంకా గాంధీ అన్నీతానై నడిపించారు. ప్రచారంలో ముందుండి నడిపించారు. కానీ ఫలితాల్లో మాత్రం మార్పు తీసుకురాలేకపోయారు. ఈ అన్నాచెళ్లెళ్ల శ్రమ.. మరోసారి వృథా ప్రయాసగానే మారింది.


 


బీజేపీ వైపే బ్రహ్మణ, జాట్‌, దళిత వర్గాలు..


యూపీలో గెలుపోటములను డిసైడ్‌ చేసే స్థాయిలో ఉన్న బ్రహ్మణ, జాట్ వర్గాలు.. కమలదళానికి మరోసారి జై కొట్టాయి. ఈసారి జాట్‌ వర్గాలు రెండుగా చీలిడం కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. చెరుకు పండించే జాట్‌ రైతులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. ఇక జాతవులు మినహా ఇతర దళితులంతా కమలంవైపే ఉన్నారు.


 


యాదవ-ముస్లిం పార్టీగా ఎస్పీపై ముద్ర..


సమాజ్‌వాదీ పార్టీపై యాదవ-ముస్లిం పార్టీగా ముద్రవేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. దీంతో మిగతా వర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. అటు విపక్షాల్లో లోపించిన ఐకమత్యం, వైఫల్యం కూడా అధికార పార్టీకి కలిసొచ్చింది. ప్రతిపక్ష కూటముల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా చీలిపోయాయి.


 


ఊపిరి పోసిన ఉచిత పథకాలు..


లోక్‌ కల్యాణ్‌ సంకల్ప్ పత్ర్‌-2022 పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. ఇందులో ప్రకటించిన ఉచిత పథకాలు ఆ పార్టీకి ఊపిరిపోశాయి. ఫ్రీ రేషన్, ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలు బాగా ప్రభావం చూపాయి. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువతకు భారీగా ఉద్యోగాలు, 6 మెగా ఫుడ్ పార్కులు ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంది.


 


అభివృద్ధి మంత్రం..


యోగీ హయాంలో యూపీ చరిత్రలోనే ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఈ ఐదేళ్లలో ఏం చేశాం.. మళ్లీ వస్తే ఏం చేస్తాం అన్నది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.


 


రౌడీయిజంపై ఉక్కుపాదం..


శాంతిభద్రతల విషయంలో యోగీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. ముఖ్యంగా రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. పేరుమోసిన ఎంతోమంది గ్యాంగ్‌స్టార్లను ఎన్‌కౌంటర్‌ చేసింది. లవ్ జిహాద్ కేసుల్లో పట్టుబడిన దోషులకు పదేళ్ల జైలుశిక్ష వంటి అంశాలు కూడా గట్టిగానే ప్రభావం చూపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com