క్రికెట్‌కి సచిన్ తెందుల్కర్ రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లు అవుతున్నా అభిమానగణం మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది విడులైన సచిన్ సినిమా ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ని తాజాగా చూసిన ఓ ఆరేళ్ల చిన్నారి ప్రేమతో ఈ దిగ్గజ క్రికెటర్‌కి లేఖ రాసింది. దీనికి సచిన్ తెందుల్కర్ కూడా అంతే ప్రేమతో స్పందించి ఆ లేఖని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
‘డియర్ సచిన్ అంకుల్, నా పేరు తారా (సారా దీదీ లాగా). కానీ.. నా వయసు ఆరేళ్లే. నేను ఇటీవల మీ సినిమా చూశాను. చాలా బాగుంది. ఆ సినిమాలో మీ చిన్ననాటి.. కొంటె పాత్ర చూసి చాలా నవ్వుకున్నాను. మీ చివరి మ్యాచ్ చూసి ఏడ్చేశాను. సచిన్ అంకుల్ నాకు మిమ్మల్ని, సారా దీదీ(సచిన్ కూతురు) , అర్జున్ భయ్యా, అంజలి ఆంటీని కలవాలని ఉంది. దయచేసి అనుమతించగలరా..?’ అని రాసుకొచ్చింది. దీనిపై సచిన్ కూడా స్పందించాడు. ‘హాయ్, తారా. లేఖ రాసినందుకు చాలా థ్యాంక్స్. సినిమా నీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నవ్వూతూ ఉండు’ అని తెందుల్కర్ సమాధానమిచ్చాడు.