ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ అజాతశత్రువు...అటల్‌ బిహారీ వాజ్‌పేయి

national |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 03:17 PM

సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్‌ అయిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం నేడు. జాతీయవాద లక్ష్యం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. సర్వశిక్షా అభియాన్, నదుల అనుసంధానం, స్వర్ణచతుర్భుజి, ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన వంటివి ఆయన మానస పుత్రికలు. అసమానమైన అనురక్తితో ఆయన ప్రజల హృదయ సామ్రాట్‌ అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాజ్‌పేయి భారతీయ అజాతశత్రువు. ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, వాజ్‌పేయి అందరికీ సన్నిహితుడు. రాజకీయాల్లో అయనకు శత్రువులు లేరు. ఆయన జాతీయవాద స్ఫూర్తి, దేశభక్తి అందరికీ ప్రేరణ కలిగిస్తాయి. ఆయన వాగ్దాటి, భావ వ్యక్తీకరణా శైలి అత్యంత సహజంగానూ, స్వతస్సిద్ధంగానూ ఉంటాయి. రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇష్టపడేవారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాల్లో తనపై విమర్శలను కూడా ఆయన నమ్రతతో ఆమోదించేవారు. పారదర్శకతను ఆయన ఎంతో దృఢంగా విశ్వసించేవారు. సుపరిపాలన లక్ష్యాన్ని ఆయన మనసారా ఆకాంక్షించేవారు. అందుకే ఆయన జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


పార్టీ, రాజకీయాలు, పదవులు, హోదాలు ఏవీ శాశ్వతం కాదనే విషయంపై ఆయన ఎంతో స్పష్టతతో ఉండేవారు. దేశం, ప్రజాస్వామ్యం ఆయనకు అత్యంత ప్రధానమైన అంశాలు. పార్లమెంట్‌ ఒక చర్చా, సంభాషణా స్థలమే తప్ప పోరాట స్థలం కానీ సవాళ్లు విసిరే స్థలం కానీ కాదని ఆయన నమ్మకం. కులం, రంగు, మతం, ప్రాంతంకి సంబంధించిన సంకుచిత భావాలకు అతీతంగా ఆయన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఉన్నత స్థాయిలో నిలిపారు. రాజకీయాల ప్రధాన దృష్టి దేశంపైనా, అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోయే దేశాభివృద్ధిపైన మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయం. దౌత్య, విదేశీ వ్యవహారాలపై ఆయన సాధికారత మహత్తరమైనది. 1998లో పోఖ్రాన్‌–2 అణుపరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా, తదితర దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించినప్పటికీ వాజ్‌పేయి చెక్కుచెదరలేదంటే ఇదే కారణం. చైనాతో సరిహద్దు వివాదాలను తగ్గించుకుని వాణిజ్య బంధాలను మెరుగుపర్చుకున్నారు. మూడు తరాల చైనా నాయకత్వంతో (మావో సేటుంగ్, డెంగ్‌ జియావోపింగ్, హూ జింటావో) వాజ్‌పేయి వ్యవహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com