ఇండియాలో పండగ సీజన్ మొదలైపోయింది. వాస్తవానికి ఈ సమయంలో చైనా నుంచి వేల కోట్ల రూపాయల విలువైన వస్తు ఉత్పత్తులు ఇండియాకు ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతూ ఉండేవి, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్ల నుంచి, పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు, ఆకర్షణీయమైన రంగులను వెదజల్లే బాణాసంచా... ఇలా ఒకటేమిటి... ఎన్నో రకాల ప్రొడక్టులు ఇండియాకు వచ్చేవి. పండగ సీజన్ లో ఇండియాలో రూ. 70 వేల కోట్ల వ్యాపారం జరిగితే, అందులో రూ. 40 వేల కోట్ల వ్యాపారం చైనా నుంచే జరుగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు చైనాకు వెళ్లాల్సిన ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి.
హిమాలయాల్లో, భారత్, చైనా సరిహద్దుల వద్ద, ముఖ్యంగా గాల్వాన్ లోయలో జరిగిన ఉద్రిక్త ఘటనల తరువాత, ఈ సంవత్సరం దీపావళి సీజన్ లో చైనా వ్యాపారులకు పెద్ద దెబ్బ తగిలినట్టేనని సీఏఐటీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆప్ ఇండియా ట్రేడర్స్) వ్యాఖ్యానించింది. చైనాకు సుమారు రూ. 40 వేల కోట్ల నష్టం వాటిల్లనుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీ భాటియా అంచనా వేశారు. ప్రజల్లో చైనా వస్తువులపై వ్యతిరేకత గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని, చైనా ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిని చూపడం లేదని ఆయన అన్నారు.
ఇక, ఇండియాలో పండగ సీజన్ అమ్మకాల కోసం ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉత్పత్తుల స్టాక్ ను పెంచుకుంటున్నారని వ్యాఖ్యానించిన ఆయన, ఈ సీజన్ లో పూజ సామాన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ప్రొడక్టులతో పాటు కాస్మెటిక్స్, బాణసంచాలకు భారీ డిమాండ్ ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. కాగా, ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీర్ వేసిన తాజా అంచనాల ప్రకారం, ఈ పర్వదినాల సీజన్ లో గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 70 శాతం వరకూ అధిక అమ్మకాలు సాగుతాయని వెల్లడైంది.
అయితే, కరోనా మహమ్మారి విస్తృతి ఇంకా తగ్గకపోవడం, అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పండగ సీజన్ అమ్మకాలు ఏ మేరకు సంతృప్తికరంగా సాగుతాయన్న విషయం ప్రశ్నార్థకమే. అయితే, ఉద్దీపన ప్యాకేజీలు అమలు అవుతుండటం, పలు రకాల ఉత్పత్తులపై... ముఖ్యంగా కార్లు, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్స్ తదితరాలపై ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్లను కంపెనీలు ప్రకటిస్తుండటం కొంత మేరకు వ్యాపారాన్ని సజావుగా నడిపిస్తుందని అంచనా.