ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శానిటైజర్లు వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 03:22 PM

కరోనా వైరస్‌ కారణంగా ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నోటికి మాస్కులు పెట్టుకోవడం, ఎప్పుడూ లేని విధంగా తరచూ చేతులు శుభ్రపరచుకోవడం వంటివన్నీ మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఈ క్రమంలోనే శానిటైజర్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే వీటివల్ల చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు తొలగిపోవడం.. వంటి ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకొని జాగ్రత్తపడదాం రండి.
కరోనా వైరస్‌ మన శరీరంలోకి నోరు, ముక్కు, కళ్ల ద్వారా ప్రవేశిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే కరచలనం, బయటికి వెళ్లినప్పుడు ఆయా ప్రదేశాలను-వస్తువులను తాకడం ద్వారా కూడా ఈ వైరస్‌ ప్రమాదం పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న విషయమూ విదితమే. అందుకే పదే పదే హ్యాండ్‌వాష్‌, సబ్బు, శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నాం. అన్ని సందర్భాల్లో సబ్బు లేదా లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని కడుక్కోవడం కుదరకపోవచ్చు. అందుకే శానిటైజర్‌ వాడకం పెరిగిపోయింది. అయితే దీనిని ఎక్కువగా వాడడం వల్ల కొన్ని నష్టాలు కూడా పొంచి ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
శానిటైజర్లతో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గృహిణులు వంటింట్లో పనిచేసే క్రమంలో గ్యాస్‌ స్టౌ వెలిగించడం, పూజ చేసే సమయంలో దీపాలు వెలిగించడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో శానిటైజర్లను చేతులకు రాసుకున్న వెంటనే ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ సెగ తాకి చేతులు మండే అవకాశం ఉంది. అంతేకాదు.. నిర్లక్ష్యంగా ఉంటే మంట చేతులకు అంటుకునే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఇందుకు కారణం శానిటైజర్లలో 60 నుంచి 90 శాతం ఆల్కహాల్‌ కలిసి ఉండడమే. సాధారణంగా ఆల్కహాల్‌కు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి గృహిణులు చేతికి శానిటైజర్లు రాసుకున్న వెంటనే కాకుండా అది చేతుల్లోకి పూర్తిగా ఇంకిపోయి, ఆరిన తర్వాతే వంటింట్లో పనులు మొదలు పెట్టడం ఉత్తమం.
చిన్న పిల్లలు శానిటైజర్లను ఉపయోగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నియంత్రణ మండలి (సీడీసీ) కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తోంది. పదేళ్ల లోపు చిన్నారులు శానిటైజర్లను వినియోగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. ముఖ్యంగా నోట్లో వేలు పెట్టుకునే అలవాటున్న పిల్లల చేతులకు శానిటైజర్లు రాయకపోవడమే ఉత్తమం అంటున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు దీనిని మింగకుండా జాగ్రత్త పడాలి.
శానిటైజర్‌ మన చేతులపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.. తద్వారా ఎన్నో రకాల అనారోగ్యాలు మన దరిచేరవన్న మాట వాస్తవమే. అయితే కొన్ని సందర్భాల్లో మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా (మంచి బ్యాక్టీరియా)ను కూడా ఈ ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు నాశనం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
అలాగే- శానిటైజర్లలో బ్యాక్టీరియాను నిరోధించే కొన్ని పదార్థాలు ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల వీటికి అలవాటు పడిపోయి కాలక్రమేణా బ్యాక్టీరియా నిరోధక శక్తి పెరిగే అవకాశాలుంటాయి. ఫలితంగా కొద్ది కాలం తర్వాత శానిటైజర్లను వాడినప్పటికీ మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా అంత సులభంగా నాశనం కాదు. నిరోధకత పెంపొంది శానిటైజర్లకు నశించని మరింత శక్తిమంతమైన బ్యాక్టీరియా తయారు కావడమే ఇందుకు కారణం.
కాబట్టి పదే పదే శానిటైజర్‌ వాడకాన్ని తగ్గించి.. వీలైనంత వరకు చేతుల్ని సబ్బు, పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. శానిటైజర్లను అధిక మోతాదులో ఉపయోగిస్తే కొన్ని రోజుల తర్వాత చర్మం పొడిబారే ప్రమాదం ఉంది. అయితే దీనికి చెక్‌ పెట్టడానికి మాయిశ్చరైజర్లను కూడా వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- వీలైనంత వరకు చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవడమే మంచిది. రసాయన పరిశ్రమల్లో పనిచేసే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయడానికి ముందు శానిటైజర్లను ఉపయోగించకూడదు. ఎందుకంటే శానిటైజర్‌లోని ఆల్కహాల్‌, ఈ రసాయనాలతో కలిస్తే చర్మంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. శానిటైజర్లు కేవలం చేతులకు అంటుకున్న బ్యాక్టీరియా, వైరస్‌లను మాత్రమే నాశనం చేస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగని దుమ్ము-ధూళి, ఇతర జిడ్డు మరకలు అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్‌ వాడడం వల్ల చేతులకు అంటుకున్న ఆ అవశేషాలు తొలగిపోవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com