ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘గీత’ దాటితే ప్రమాదం!

national |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2020, 03:30 PM

సరిగ్గా ఏడాది క్రితం మార్చి 25, 2019న జైపూర్‌లో రాజస్తాన్‌ రాయల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. పంజాబ్‌ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ దూసుకుపోయింది. 44 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన స్థితిలో చేతిలో 9 వికెట్లున్నాయి. ఈ సమయంలో పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ సంజు సామ్సన్‌కు బౌలింగ్‌ చేస్తున్నాడు. అయితే నాన్‌ స్ట్రయికర్‌గా ఉన్న జోస్‌ బట్లర్‌... అశ్విన్‌ ‘డెలివరీ స్ట్రయిడ్‌’ పూర్తి కాకముందే క్రీజ్‌ దాటి పరుగు కోసం ముందుకొచ్చాడు. ఏమరుపాటుగా ఉన్న అశ్విన్‌ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్‌ కోసం అప్పీల్‌ చేశాడు. బట్లర్‌ చాలా ముందుకు వెళ్లిపోవడంతో అవుట్‌ కాక తప్పలేదు. అలా ‘మన్కడింగ్‌’ ద్వారా అవుట్‌ చేసి అశ్విన్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని విమర్శలు వచ్చినా... నిబంధనల ప్రకారం సరైందేనని భారత స్పిన్నర్‌ వాదించాడు. బట్లర్‌ వెనుదిరిగాక ఛేదనలో తడబడిన రాజస్తాన్‌ చివరకు 14 పరుగులతో ఓడిపోయింది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ ఘటనను అశ్విన్‌ మళ్లీ గుర్తు చేసుకున్నాడు.కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ప్రకటించిన కర్ఫ్యూ, దాని కారణంగా వస్తున్న సమస్యలను అతను ‘మన్కడింగ్‌’తో పోల్చాడు. గీత దాటితే రనౌట్‌ అయినట్లు ఇప్పుడు ‘ఇల్లు దాటితే కష్టమని’ అశ్విన్‌ చెబుతున్నాడు. బయటకు రాకుండా ఉండటం కొంత కష్టమే అయినా... చివరకు విజయం కోసం ఇదంతా చేయాల్సిందేనని అతను అంటున్నాడు. ‘దేశం మొత్తం లాక్‌డౌన్‌ అవుతున్న వేళ దీనిని గుర్తు చేయడం అవసరమని నేను భావిస్తున్నా. బయట ఎక్కడా తిరగకండి. ఇంట్లోనే ఉండండి.భద్రంగా ఉండండి’ అని నాటి రనౌట్‌ ఫొటోతో అశ్విన్‌ ట్వీట్‌ చేయడం విశేషం. మొదటి నుంచి ప్రకృతి ప్రేమికుడు అయిన అశ్విన్‌ తాజా పరిణామాల పట్ల తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘ఈ విశ్వం ఇప్పుడు మానవజాతిని సవాల్‌ చేస్తోంది. సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండగలమా అని ప్రశ్నిస్తోంది. మరో మనిషి కోసం మనం ఎంత త్యాగం చేయగలమో నిజాయితీగా చెప్పమని అడుగుతోంది. ఇవన్నీ సమాధానం చెప్పలేని కఠినమైన ప్రశ్నలు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వీటికి జవాబులు ఆలోచించండి’ అంటూ కూడా అతను తన ట్విట్టర్‌లో అభిప్రాయం వ్యక్తం చేశాడు.క్రీడలకంటే ప్రధానమైనవి ఎన్నో...న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం అశ్విన్‌ కొన్ని స్థానిక లీగ్‌లలో ఆడాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ నెలకొన్న నేపథ్యంలో అతను తన సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తన రోజువారీ కార్యక్రమాల గురించి పలు ఆసక్తికర అంశాలు అతను పంచుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com