ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 16, 2020, 07:54 PM

ఆనాడు మహా నేత ఎన్ టీ రామారావు పార్టీ పెట్టిన కొన్నిరోజుల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేసిన ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో 288 చోట్ల పోటీ చేసి చివరకు 18 సీట్లు మాత్రమే సంపాదించుకోగలిగారు. కచ్చితంగా సీఎం అవుతాననుకున్న చిరంజీవి ఆశలన్నీ పటాపంచలయ్యాయి. వస్తుందనుకున్న అధికారం రాకుండా పోవడాన్ని తట్టుకోలేకపోయిన చిరంజీవి కాంగ్రెస్ ఆహ్వానించేసరికి మరోమాట ఆలోచించకుండా హస్తంతో చేతులు కలిపేసి కేంద్ర సహాయ మంత్రి పదవితో సరిపెట్టేసుకున్నారన్నది విశ్లేషకుల మాట. చిరంజీవిని ఓట్లేసి గెలిపించింది ప్రజలు. కానీ ప్రజల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకున్నారనీ ఆ ప్రభావం ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై పడి జనసేనకు అంతగా గుర్తింపు రాకుండా పోయిందన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.


చిరంజీవి లాగా వేగంగా నిర్ణయాలు తీసేసుకోకుండా అత్యంత జాగ్రత్తగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఐదేళ్ల కిందటే పార్టీ పెట్టి... టీడీపీకీ, బీజేపీకీ సపోర్ట్ ఇచ్చిన ఆయన సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు మాత్రం ఆ పార్టీలకు దూరంగా జరిగి తన పార్టీ అస్థిత్వాన్ని నిలబెట్టుకున్నారన్నది కొందరి మాట. ఇంతవరకూ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అంతగా పుంజుకోని పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మొన్నటి ఎన్నికల్లో అంచనాలకు తగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఏదో చేస్తారనుకుంటే పవన్ కళ్యాణ్ కీలక సమయంలో సైలెంటైపోయి అధికార టీడీపీపై పెద్దగా విమర్శలేవీ చెయ్యకుండా మౌనంగా ఉండిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఐదు లేదంటే అంతకంటే తక్కువ స్థానాలను గెలిచిన పార్టీ... ప్రతిపక్షంగా ఎక్కువ కాలం నిలవడం కష్టమే. ఇప్పటికే వామపక్షాలు ఎప్పటి నుంచో తక్కువ స్థానాలతో నెట్టుకొస్తూ... కొన్ని వర్గాలకు పరిమితమవుతూ... నామ్ కే వాస్తే అన్నట్లు కొనసాగుతున్నాయి. ఏ కొత్త పార్టీకైనా మొదట్లో ఉండేంత క్రేజ్ తర్వాతి కాలంలో ఉండదు. రాన్రానూ క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. అరుదైన సందర్భాల్లోనే క్రేజ్ పెరుగుతుంది. జనసేన పార్టీ పెట్టినప్పుడు, టీడీపీతో జట్టు కట్టినప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు జనసేనకు ఉందా అన్నది తేలాల్సిన ప్రశ్న. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్... జనసేన పార్టీకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నారు. అన్నయ్య చిరంజీవిలా పార్టీ వ్యతిరేక నిర్ణయం తీసుకోకుండా జనసేన భవిష్యత్తుకు ఏవిధంగా ఉండబోతున్నారన్నది మరికొందరిలో చర్చనీయాంశమైంది.


ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అదే సమయంలో బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని జనసేన పార్టీ నిర్ణయించింది. రెండు పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రెండు పార్టీలు కలిసి ముందుకెళతాయని, నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, అమిత్ షా సూచనల మేరకు రెండు పార్టీలు ముందుకు వెళతాయని అన్నారాయన. 2014 నుంచి ముందుగా టీడీపీ, ఆ తర్వాత వైసీపీ అధికారంలో వుంటూ అవినీతిమయమైన పాలనను అందించాయని కన్నా ఆరోపించారు. ఏపీలో సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీ-జనసేనలతోనే సాధ్యమని కన్నా అన్నారు.


బీజేపీతో పొత్తును ఎండార్స్ చేసిన పవన్ కల్యాణ్… భారతీయ జనతాపార్టీ అండదండా ఏపీకి అత్యంత అవసరమని చెప్పారు. ఏపీ ప్రజల రక్షణ, సంక్షేమ, అభివృద్ధి కోసం రెండు పార్టీలు కలుస్తున్నాయని చెప్పారు. ఇరు పార్టీల మధ్య సంపూర్ణ అవగాహన కుదిరిందని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండు పార్టీల మధ్య ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని, ప్రతీ నెలకోసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ కలిసి వెళతామని వెల్లడించారు జనసేనాని. టీడీపీ, వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.


ఆనాడు కాంగ్రెస్ ను తిట్టిపోసిన అన్న చిరంజీవి చివరికి అదే పార్టీలో చేరిపోయారు. బిజెపికి మద్దుతునిచ్చి... ఆ తర్వాత బిజెపి నాయకులనే తిట్టిపోసిన పవన్ నేడు మళ్లీ బిజెపితోనే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. ఇంతకీ ఈ అన్నాదమ్ములు ఎటువైపు వెళ్లనున్నారు. వీరికి పార్టీ పదవులే ముఖ్యమా.. లేక ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యమా.. అంటూ సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటం వల్ల వీరిద్దరూ తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని లేకుంటే వీరు చేసే చిల్లర రాజకీయాలకు ఎప్పుడో ఛీదరించుకునేవారని మరికొందరు గుసగుసలాడుకోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com