నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ (62; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు)తో భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా బంగ్లా బౌలర్ ఆఫిఫ్ హుస్సేన్ వేసిన 15 ఓవర్లో అయ్యర్ హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. ఆ ఓవర్ తొలి బంతిని లాంగాన్ మీదుగా బౌండరీగా మలచిన అయ్యర్.. రెండో బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. ఇక మూడో బంతిని మళ్లీ లాంగాన్ దిశగా భారీ సిక్స్‌గా బాదాడు. ఈ క్రమంలో అయ్యర్ కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదుతాడేమోనని అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే, అయ్యర్ కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనే అనుకున్నాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం చాహల్ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో శ్రేయాస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. "నేను ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని అనుకున్నాను, కానీ, ఆ తర్వాతి బంతిని బౌలర్ వైడ్ యార్కర్‌గా వేశాడు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా తొలి మూడు బంతుల్ని సిక్సులుగా బాదిన తర్వాత ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని అనుకుంటాడు. కానీ, అది సాధ్యం కాలేదు" అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఆరు వికెట్లు తీసి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీపక్ చాహర్‌పై చాహల్ ఫన్నీ సెటైర్ వేశాడు. చాహాల్ టీవీకి ఇంటర్యూలో భాగంగా చాహల్ మాట్లాడుతూ "నా బౌలింగ్ రికార్డుని అధిగమించాడు, సిగ్గులేని వ్యక్తి" అంటూ దీపక్ చాహర్‌ను సంబోధించాడు. టీ20 క్రికెట్లో దీపక్ చాహర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన 6/7. అంతకముందు శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ (6/8; 2012లో జింబాబ్వేపై) రికార్డును బద్దలు కొట్టాడు. మెండిస్ రికార్డుని బద్దలు కొట్టడంపై దీపక్ చాహర్ మాట్లాడుతూ "నేను హ్యాట్రిక్ తీసుకున్నానని నేను గ్రహించలేదు, అదొక అద్భుతమైన అనుభూతి" అని పేర్కొన్నాడు.