ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 ఏండ్ల బాలికపై 30 మంది అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2019, 12:03 PM

ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తున్న గాథ ఇది. ఆ చిన్నారి 12 ఏళ్ల వయసులోనే 30 మంది మృగాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారింది. కంటి పాపగా కాపాడాల్సిన కన్న తండ్రే దారుణానికి ప్రోత్సహించడంతో పంటి బిగువున తన బాధను అనుభవించి తాను కామాంధుల చేతిలో బలై పోయింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.


కేరళలోని మలప్పురం జిల్లా. అక్కడ ఓ పేద కుటుంబం ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటుంది. కుటుంబ పెద్ద, భార్య, 12 ఏళ్ల కూతురు, తన తల్లి ఉండేవారు. ఆ కుటుంబ పెద్దకు ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఏదో పని చేసి కుటుంబాన్ని పోషించాల్సిన ఆ ప్రబుద్దునికి ఓ వికృత ఆలోచన వచ్చింది. తన భార్యను వ్యభిచారిగా మార్చి డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. దీంతో తన కన్ను తన పన్నెండేళ్ల కూతురి పై పడింది. ఓ వ్యక్తి దగ్గర అప్పు చేశాడు. దానిని తీర్చలేదు. ఇంట్లో ఎవరూ లేని ఓ సమయంలో తండ్రి దగ్గరుండి తనకు అప్పు ఇచ్చిన వ్యక్తిని కూతురు దగ్గరకు పంపాడు. రూంలో ఏం జరుగుతుందో తెలియని బాలిక గట్టిగా అరిచినా తండ్రి కనికరించలేదు. ఆ డోర్ దగ్గర కాపలాగా ఉన్నాడు. అలా ఆ చిన్నారి జీవితం చిద్రమైంది. ఈ విషయం తర్వాత తల్లికి చెప్పినా ఆమె కూడా పట్టించుకోనట్టే ఉంది. ఏం చేయలేననే నిస్సహాయత వ్యక్తం చేసింది. అలా తన తండ్రి అప్పు చేసిన వ్యక్తల్లా ఆ 12 ఏళ్ల అమ్మాయితో తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. బాలిక స్కూల్ కి వెళ్లినప్పుడు పారిపోదామనుకునేది. కానీ తాను నలిగిపోతేనే తన కుటుంబం గడుస్తుందన్న విషయం గుర్తుకు వచ్చి తిరిగి ఇంటికి వచ్చేది. ప్రతి రోజు బాలిక రూంలో నుంచి అరిస్తే శబ్దాలు వచ్చినా ఇతరులు పట్టించుకునేవారు కాదు. బాధలు భరించలేక బాలిక పాఠశాల బంద్ చేసింది. ఇక ఆ తర్వాత పగలు, రాత్రి అనే తేడా లేకుండా బాలిక పై లైంగిక దాడులు జరిగాయి. బాలిక పై మొదటిసారి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి బాలిక తండ్రి పరిస్థితి గమనించి తానే బ్రోకర్ గా మారాడు. నెలకు కొంత డబ్బు ఇస్తానని చెప్పి బాలిక ఇంటికి విటులను తీసుకు వచ్చేవాడు. బాలిక నాన్నమ్మ, తల్లి చూస్తూ ఉండేవారు తప్ప ఏం చేయలేకపోయారు. అలా రెండేళ్ల నుంచి దాదాపు 30 మంది బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు.


గత వారం కేరళ పబ్లిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ కౌన్సిలర్ బాధిత బాలిక పాఠశాలను సందర్శించింది. బాలిక సరిగ్గా పాఠశాలకు రావడం లేదని తెలుసుకొని బాలికను పాఠశాలకు పిలిపించారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. అప్పుడు బాలిక తనకు జరిగిన ఘోరాన్ని వివరించింది. ఇది విన్న అధికారులు, ఉపాధ్యాయిలు షాకయ్యి కన్నీరు పెట్టుకున్నారు. బాలిక దీనస్థితిని చూసి వారు చలించిపోయారు. వెంటనే సీరియస్ అయిన అధికారులు పకడ్బంధీగా బాలిక తండ్రి, ఇద్దరు విటులను పోలీసులకు పట్టించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బాలిక వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. బాలిక లైంగిక వేధింపులకు గురైందని వైద్యులు తేల్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆ పాపను ప్రభుత్వ ఆడపిల్లల సంరక్షణ కేంద్రానికి పోలీసులు తరలించారు. పోలీసులు ఆ పాపను ఇంటి నుంచి తీసుకెళుతున్నప్పుడు ఆ పాప తన ఇంటి తలుపుపై ‘అమ్మా! సారీ’ అని రాసింది. ఇన్ని రోజులు చేసిన పనితో పట్టెడన్నం అందరికి పెట్టానని ఇక పెట్టలేననా లేక వారికి దూరమైతున్నందుకు తన అమ్మకు సారీ చెప్పిందో అర్ధమవ్వడం లేదు. బాలిక గాథ విన్న ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. కసాయిగా మారిన తండ్రిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేదరికం చాటున ఇంకెన్నీ జీవితాలు నాశనమవుతున్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధనవంతులు పేదరికాన్ని ఆసరాగా చేసుకొని అనేక మంది ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారని సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పేరుకే రక్షణ చర్యలు అంటుందని కానీ బలిచిన బడాబాబుల చేతిలో ఖూనీగా మారిందని మహిళా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికకు అన్ని వసతులు కల్పిస్తామని, తనకు జీవితాంతం అండగా ఉంటామని కేరళ ప్రభుత్వం భరోసానిచ్చింది. తల్లిదండ్రుల వద్దకు పంపమని, ప్రభుత్వ సంరక్షణలోనే బాలిక ఉంటుందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. నిత్యం అనేక మంది చిన్నారుల జీవితాలు కామాంధుల చేతిలో బలైపోతున్నాయని పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి అత్యాచారాలు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com