ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులను స్మరిస్తూ...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2019, 11:09 AM

పురాణ కాలం నుంచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ.. అన్న తరువాత ఆచార్య దేవోభవ.. అని పలుకుతూ గురువులకు ప్రాధాన్యతను ఇవ్వడం అనాదిగా వస్తోంది. ఎందుకంటే గురువు.. మనలోని అజ్ఞానాన్ని పారదోలి వెలుగు ఇస్తాడు కనుక.. గురువుకు పురాణ కాలం నుంచి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇక మనకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు మాత్రమే గురువులు కాదు, మనకు ఏ విషయాన్ని ఎవరు నేర్పినా వారిని కూడా మనం గురువులు అనాల్సిందే. 
గు అంటే చీకటి అని.. రు అంటే తొలగించు అని అర్థం వస్తుంది. అంటే.. అజ్ఞానమనే చీకటిని గురువు తొలగిస్తాడన్నమాట. మనకు విద్యాబుద్ధులతోపాటు చక్కని నడవడిక, ప్రవర్తన, క్రమశిక్షణను గురువు నేర్పిస్తాడు. అందుకే మనం జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం. అయితే ఒకప్పుడు గురుకులానికి వెళ్లి విద్య నేర్చుకున్నట్లుగా ఇప్పుడు విద్యావిధానం లేదు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి చదువు కొనుక్కుని విద్య నేర్చుకుంటున్నారు. అలాగే విద్యార్థులకు పాఠాలు బాగా చెప్పి వారితో కలిసిపోయే ఉపాధ్యాయులు నేడు కనిపించడం లేదు. ఉత్తమ ఉపాధ్యాయులు ఇప్పుడు మనకు కనిపించడమే కష్టతరమవుతోంది. అయినప్పటికీ విద్యార్థులకు విద్య నేర్పే గురువులంటే దైవంతో సమానమే. 
నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి 
ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి
జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు 
సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు 
అతడు ...ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !  
మనకు జన్మనిచ్చిన తల్లి దండ్రుల తర్వాత మనం గౌరవించేది.... మనల్ని గౌరవించేది.... మన మంచిని కోరేది..... కల్మషం లేని మనసుతో మనల్ని దీవించేది ఎవరైనా ఉన్నారంటే వారు గురువులే.. అందుకే మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్5 ఉపాద్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ గురువులను పూజిస్తున్నాం.. వారి సేవలను గుర్తుచేసుకుంటున్నాం. అయితే ఎందుకు అదే రోజు ఉపాద్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు టీచర్స్‌ డేగా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. అయితే సర్వేపల్లి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన తన మాత్రం ఉపాధ్యాయుడిగానే తన జీవితాన్ని మొదలు పెట్టాడు. ఆ వృత్తితోనే గొప్ప పదవులను సాధించాడు. కాని ఏ రోజు తనకు ఆ పదవి, ఈ పదవి కాదు నాకు ఉపాద్యాయ వృత్తిలోనే సంతృప్తి చెందాను అని తెలిపారు. 
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com