ట్రెండింగ్
Epaper    English    தமிழ்

’రెండాకులు ఎవరికీ ఇవ్వం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 01:35 AM

 -శశికళ, పన్నీరు సెల్వంలకు షాకిచ్చిన ఎన్నికల సంఘం


 -ఆర్కే నగర్‌ ఉపఎన్నికలో మద్దతుపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్‌!


 -దీపతో కలిసి పని చేసేందుకు సిద్ధం: పన్నీరు సెల్వం వర్గం


 -శశికళను శపిస్తూ జైలుకు పోటెత్తుతున్న ఉత్తరాలు


 -అన్నాడీఎంేక పేరును మార్చుకున్న శశికళ వర్గం!


న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ తమదంటే తమదంటూ పోట్లాడుకుంటున్న శశికళ, పన్నీరు సెల్వం వర్గాలకు కేంద్ర ఎన్నిక సంఘం షాక్‌ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు తమదేనంటూ, తమకే కేటాయించాలంటూ శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రెండు వర్గాల వాదనలు విన్న జాతీయ ఎన్నికల సంఘం ఈ గుర్తును బ్లాక్‌ చేస్తున్నట్టు చెప్పింది. రెండాకుల గుర్తును పక్కనపెట్టి ఇతర గుర్తులు ఎంచుకోవాలని ఈ రెండు వర్గాలకు సూచించింది. కొత్త గుర్తుపై నిర్ణయం తీసుకోవాలని రెండు వర్గాలకు సూచించింది. దీంతో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని శశికళ వర్గం తెలిపింది.  పన్నీర్‌ సెల్వం, శశికళలు నేతృత్వం వహిస్తున్న రెండు అన్నాడీఎంకే క్యాంపులకూ షాకిస్తూ, రెండాకుల గుర్తును ఎవరికీ ఇవ్వలేమని, ఈ విషయమై పార్టీ గుర్తును తాత్కాలికంగా నిషేధిస్తున్నామని చెప్పిన ఎలక్షన్‌ కమిషన్‌, తమ నిర్ణయానికి కారణాన్ని వివరించింది. ఈ గుర్తు తమకు చెందాలంటే, తమకే చెందాలంటూ, ఇరు వర్గాలు 20 వేల పేజీలకు పైగా నివేదికలను కేవలం ఒక్క రోజు ముందు ఇచ్చాయని, ఏ మానవ మాత్రుడికీ, వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, నిర్ణయం తీసుకోవడం అంత సులువయ్యే పని కాదని పేర్కొంది. రెండు వర్గాల వాదనలూ పరిశీలించాల్సి వున్నందునే గుర్తును ఎవరికీ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా, త్వరలో ఆర్కే నగర్‌ నియోజకవర్గ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పన్నీర్‌ సెల్వం వర్గం తరఫున ఈ మధుసూదనన్‌, శశికళ వర్గం తరపున దినకరన్‌ పోటీ పడుతుండగా, జయ మేనకోడలు దీప, డీఎంకే అభ్యర్థి కూడా రంగంలోకి దిగుతుండటంతో ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. జయలలిత మరణంతో చెన్నైలోని ఆర్కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఉపఎన్నికలో అన్నాడీఎంకే తరపున శశికళ బంధువు దినకరన్‌, పన్నీర్‌ సెల్వం వర్గం తరపున మధుసూదనన్‌, జయ మేనకోడలు దీపలతో పాటు డీఎంకే కూడా బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్‌ రజనీకాంత్‌ ను కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని రజనీని అభ్యర్థించారు. వీరిద్దరూ కలసిన ఫొటోలు మీడియాలో రావడంతో, అమరన్‌ కు రజనీ మద్దతు ఇస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. దీంతో, రజనీ స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలో తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారు. ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు జయ దీపతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గానికి చెందిన మాజీ మంత్రి మాఫో పాండ్యరాజన్‌ తెలిపారు. చెన్నైలోని పన్నీరు సెల్వం నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ, దివంగత జయలలిత ఆశీర్వాదంతో ఇ.మధుసూదనన్‌ తమ వర్గం నుంచి ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేస్తారని అన్నారు. ప్రస్తుతం పార్టీలో అమ్మ జయలలిత గతంలో బహిష్కరించిన వారిని తిరిగి చేర్చుకున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు దీనిపై ఆగ్రహంగా ఉన్నారని ఆయన చెప్పారు. దీపను తాము ప్రత్యర్థిగా చూడడం లేదని, ఆమెను మరింత ఉన్నతంగా చూడాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. తమకు కేవలం డీఎంకే మాత్రమే ప్రత్యర్థి అని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఉత్తరాలు పోటెత్తుతున్నాయి. ఈ లేఖలన్నీ శశికళను ఓదార్చడానికో లేక ధైర్యం చెప్పడానికో రాయలేదు. ఆమెను శపిస్తూ రాసినవి. జయలలిత మరణానికి కారణమైన శశికళ నాశనమైపోతుందంటూ శపిస్తూ పలువురు రాసిన ఉత్తరాలు ఇవి. ఇప్పటి వరకు ఇలాంటి ఉత్తరాలు వందకు పైగా వచ్చాయట. శశికళ, సెంట్రల్‌ జైల్‌, పరప్పణ అగ్రహార, బెంగళూరు - 560100 అడ్రస్‌ కు ఈ లేఖలు వచ్చాయి. ఈ ఉత్తరాలు రాసినవారు అందులో శశికళను నానా తిట్లు తిట్టారు. జయలలిత హత్యకు శశికళే కారణం అని ఆరోపించారు. జయ అనారోగ్యంతో చనిపోలేదని... ప్రణాళిక ప్రకారమే కుట్ర పన్ని చంపేశారని మండిపడ్డారు. తమకు ఎంతో ఇష్టమైన అమ్మను చంపిన నీవు... ఓ వెన్నుపోటుదారువి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీవు చేసిన దారుణాలకు అంతకంతా అనుభవిస్తావని... క్షణక్షణం నరకయాతన అనుభవిస్తావంటూ శపించారు. ఈ లేఖలు తమిళనాడులోని దిండిగల్‌, కరూర్‌, తిరుచిరాపల్లి, మధురై, ధర్మపురి, సేలం, చెన్నైల నుంచి వచ్చాయని జైలు సిబ్బంది తెలిపారు. మొదట్లో ఈ ఉత్తరాలను శశికళ చదివేవారని, ఆ తర్వాత చదవడం మానేశారని అధికారులు వెల్లడించారు. ఇళవరసి కూడా ఈ ఉత్తరాలను చదివేవారని, అభ్యంతరకరంగా ఉన్న వాటిని చింపేసేవారని చెప్పారు. త్వరలో జరగనున్న ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పేరును వాడుకోరాదని, రెండాకుల గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ స్పష్టం చేయడంతో కొత్త పార్టీ పేరును శశికళ వర్గం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ’ఏఐఏడీఎంకే అమ్మ’ పేరు మీదట పోటీ చేస్తామని, తమకు ఆటో, క్యాబ్‌, బ్యాట్‌ లలో ఏదో ఒక గుర్తును ఇవ్వాలని కోరింది. ఇప్పటికే అమ్మ ఏఐఏడీఎంకే పేరుపై పన్నీర్‌ సెల్వం ఆర్కే నగర్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మధుసూదనన్‌ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో శశికళ, పన్నీర్‌ సెల్వం వర్గాలకు చెందిన అభ్యర్థులతో పాటు, డీఎంకే, దీప కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోటీ తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com