మానవతావాది, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం తర్వాత ఆయనకు సంబంధించిన పలు ఆస్తకికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 1996లో రతన్ టాటా తన స్వహస్తాలతో రాసిన లేఖను ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. దేశానికి అవసరమైన సమయంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి, అత్యుత్తమ విజయం సాధించారని పీవీపై టాటా ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ఆర్ధిక సంస్కరణలకు పితామహుడిగా గుర్తింపు పొందారు. దివాలా అంచుకు చేరిన దేశాన్ని.. తన సాహసోపేత నిర్ణయాలతో ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, భారత అభివృద్ధికి పీవీ బాటలు వేశారు.
ఇదే విషయాన్ని రతన్ టాటా తన లేఖలో ప్రస్తావించారు. ‘భారతదేశ భవిష్యత్తు కోసం సాహసోపేతమైన, దూరదృష్టితో మీరు తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రతి భారతీయుడు మీకు రుణపడి ఉంటారు’ అని 1996 ఆగస్టు 27న రాసిన లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు. ‘డియర్ పీవీ నరసింహరావు.. నేను ఇటీవలి కాలంలో మీ గురించి దారుణమైనవి కథనాలు చదివాను.. ఇతరుల మీరు చేసిన మంచి పనిని మరిచిపోవచ్చు... కానీ, దేశానికి అవసరమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి మీరు సాధించిన అత్యుత్తమ విజయాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తించి, గౌరవిస్తానని మీకు చెప్పడానికి లేఖ రాయాల్సి వచ్చింది... మీరు, మీ ప్రభుత్వం ఆర్థిక కోణంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు.. మమ్మల్ని ప్రపంచ సమాజంలో భాగం చేశారు.. సాహసోపేతమైన, దూరదృష్టితో మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతి భారతీయుడు మీకు కృతజ్ఞతతో రుణపడి ఉండాలి..
మీ విజయాలు ముఖ్యమైనవి.. అత్యద్భుతమైనవి అని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను.. వాటిని ఎప్పటికీ మరచిపోకూడదు.. దేశం కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ మరచిపోలేనివని చెప్పడానికే వ్యక్తిగతంగా నేను రాసిన లేఖ ఇది.. ఈ సమయంలో నా అభినందనలు, శుభాకాంక్షలు మీకు ఉంటాయని తెలియజేయడం’ అని రతన్ టాటా ముగించారు.
ఆర్థికంగా, పారిశ్రామికంగా దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించడంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి పీవీ ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా దేశం ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా భారత్ అవతరించినా.. మరో పదేళ్లలో మూడో శక్తిగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నా దానికి కారణం నాటి ప్రధాని పీవీ చేపట్టిన సంస్కరణలే. ఈ విషయంలో మరో ఆలోచన అవసరం లేదు.