సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ 2024-29 పారిశ్రామిక అభివృద్ధి పాలసీని రూపొందించారు. అలాగే ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రోత్సాహకాలను కూడా ఎస్క్రో ఖాతాలో వేసేలా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీకి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాలసీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక వీటితో పాటుగా ఆహారశుద్ధి విధానంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా పాలసీ రూపకల్పనపై కూడా ఏపీ కేబినెట్ చర్చించినట్లు సమాచారం. ఇక మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూమి కేటాయింపులపైనా ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితోపాటు డ్రగ్స్ కట్టడి, అక్రమ మద్యం అమ్మకాల నియంత్రణ కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. రాజధాని అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు, చెత్త పన్ను రద్దు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకం, కొత్త మున్సిపాలిటీలలో పోస్టులు వంటిపైనా ఏపీ మంత్రివర్గం చర్చిస్తోంది.ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు రేపు హర్యానా వెళ్లనున్నారు. హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల వరకూ చంఢీగఢ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం చండీగఢ్‌లో జరిగే ఎన్డీయే పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.