దసరా పండుగతో నాటు కోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో కేవలం రెండు కిలోల బరువుండే కోడి రూ.2,500లకు అమ్ముడుపోయింది. వాస్తవానికి గిరిజన ప్రాంతాల్లోని వారపు సంతల్లో పెద్ద నాటు కోడి వెయ్యి రూపాయలకు మించి ఉండదు. కానీ దసరా పండుగలో నాటు కోడిని కోయడం, తినడం సహజం కావడంతో అధిక శాతం జనం నాటు కోళ్ల కోసం వారం రోజుల నుంచి ఎగబడుతున్నారు. దీంతో వారపు సంతల్లో, గిరిజన పల్లెల్లో సైతం నాటు కోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మండలంలో గుత్తులపుట్టులో గురువారం జరిగిన వారపు సంతలో రెండు కిలోలుండే నాటు కోడిని రూ.1500 నుంచి రూ.2 వేలకు విక్రయిస్తే, అదే కోడిని శుక్రవారం పాడేరు వారపు సంతలో రూ.2,500లకు రైతులు విక్రయించారు. ధర అధికంగా ఉన్నప్పటికీ దసరా నేపథ్యంలో నాటుకోళ్లను కొనేందుకు జనం ఎగబడ్డారు.