గత ప్రభుత్వంలో వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి నెలనెలా ఒక్కొక్కరికి రూ.200 ఇస్తూ కేవలం జగన్ పత్రికనే కొనుగోలు చేయాలని అనధికారికంగా ఆదేశించారనే సమాచారం తమకు ఉందని, దీనిపై విచారణ జరుగుతోంద ని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పత్రిక కొనుగోలుకు సంబంధించిన జీవోను రద్దు చేశామని, ఎన్ని కొన్నారనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటనల జారీలో ఇష్టానుసారంగా వ్యవహరించారని, దీనిపైనా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. నచ్చిన పత్రిలకు పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేశారని, ప్రభుత్వాన్ని భుజాన మోయని పత్రికలకు పూర్తిగా యాడ్స్ ఆపేశారన్నారు. కొన్ని పత్రికలు తటస్థంగా ఉన్నా యాడ్స్ ఇచ్చి పేమెంట్ చేయలేదని, చివరకు వారే వెనక్కి తగ్గేలా నీచమైన పద్ధతిని పాటించారని విమర్శించారు.
అమరావతి సచివాలయంలో ఆధునికీకరించిన తన చాంబర్‌లోకి ఆయన శాస్త్రోక్తంగా ప్రవేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయి. కేంద్రం ఇచ్చిన దాదాపు రూ.4,500 కోట్ల నిధులను పక్కదారి పట్టించి నిరుపేదలకు అన్యాయం చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కో యూనిట్‌కు రూ.2.50 లక్షల రుణ సహాయాన్ని అందజేస్తే, దాన్ని రూ.1.80 లక్షలకు తగ్గించారు. ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణాలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు అదనంగా అందజేసే ఆర్థిక సాయాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు’ అని ధ్వజమెత్తారు.