దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా ఈ పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది.
మరోవైపు దసరా నవరాత్రుల్లో భాగంగా నేడు చివరి రోజు. ఈ నేపథ్యంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో.. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దేవాలయంలోకి వెళ్లే అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఇంకోవైపు దుర్గమ్మ మాల ధారణతో వచ్చిన భవానీలు సైతం భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.