ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న‌న్ను ఎందుకు తొల‌గించారో క‌న్నా స‌మాధానం చెప్పాలి:చినబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 22, 2019, 12:03 PM

విజ‌య‌వాడ‌: భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షునిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టాకా పార్టీ పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడినట్లైంద‌ని, ఆయ‌న పార్టీలోకి వ‌చ్చిన నాటినుండి అన్నీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలే జ‌రుగుతున్నాయ‌ని భాజ‌పా రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌స‌భ్యులు ఉంగ‌రాల వెంక‌ట‌ర‌మ‌ణ (చిన‌బాబు) అన్నారు. మ‌హాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోట‌ల్‌లో సోమ‌వారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పించారు. పార్టీ స‌భ్యుడిగా ఉన్న త‌న‌ను ఎన్నిసార్లు తొలగిస్తార‌ని, ఎందుకు తొల‌గించారో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పార్టీలో త‌న‌పై జ‌రిగిన వ్య‌తిరేక విధానాల‌పై సెంట్రల్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విభాగానికి ఫిర్యాదు చేస్తాన‌ని పేర్కొన్నారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నియామ‌క స‌మ‌యంలో జాతీయ అధ్య‌క్షుడు నిర్ణ‌యాన్ని బ‌హిర్గ‌తంగా మీడియాలో విమ‌ర్శించిన‌వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య తీసుకోవాల‌ని కోర‌డ‌మే తాను చేసిన త‌ప్పా అని ప్ర‌శ్నించారు. పార్టీలో ఒక ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని ఎన్నిసార్లు ర‌ద్దు చేస్తార‌ని పేర్కొన్నారు. వివిధ మంత్రుత్వ శాఖ‌ల్లో నామినేటెడ్ పోస్టుల కోసం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఇచ్చిన సిఫార్సు ఉత్వ‌ర్వుల్లో భాజ‌పా కార్య‌క‌ర్త‌లు ఎంత‌మంది ఉన్నారో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. భ‌జ‌న బృందానికి కాకుండా భాజ‌పా కార్య‌క‌ర్త‌లకు ఎంత‌మందికి పార్టీ బాధ్య‌త‌లు ఇచ్చార‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌నుద్దేశించి ప్ర‌శ్నించారు. అలాగే స్వ‌యంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించిన వారే నేడు పార్టీని వీడుతున్నార‌ని అందుకు ఆయ‌న ఏ విధంగా జ‌వాబు చెబుతార‌ని అన్నారు.  మాజీ ముఖ్య‌మంత్రి నేదుర‌మ‌ల్లి జ‌నార్థ‌న‌రెడ్డి త‌న‌యుడు రామ్‌కుమార్, ఆకుల స‌త్య‌నారాయ‌ణ, రామ‌కోట‌య్య త‌దిత‌ర నాయ‌కులు భాజ‌పాను వ‌దిలి వెళ్లిపోతున్న‌ప్పుడు వారిని ఆప‌డానికి చేసిన ప్ర‌య‌త్నం ఏమిటో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటునే వేరే పార్టీకి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కోవ‌ర్టుగా పనిచేస్తున్నారు అనటానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏంకావాల‌ని మండిప‌డ్డారు. క‌న్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన తర్వాత అనేక జిల్లాల్లో బీజేపీ సీనియర్ నాయకులు రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. బీజేపీ పార్టీలో ఉన్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను కన్నా లక్ష్మీనారాయణ తన పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. బీజేపీ పార్టీని ఖాళీ చేసే పనిలో కన్నా లక్ష్మీనారాయణ నిమగ్నమయ్యారని విమర్శించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరుతున్న స్పందించకపోవడం ప‌ట్ల ఆంతర్యం ఏమిట‌ని ప్రశ్నించారు. ఈ నెల 27న కాకినాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో భారీఎత్తున స‌భ‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు చెప్పారు. ఆ స‌భ ద్వారా త‌న స‌త్తా ఏమిటో చూపుతాన‌ని ఉంగ‌రాల వెంక‌ట‌ర‌మ‌ణ (చిన‌బాబు) స్ప‌ష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com