ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కు సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. నేటితో (ఏప్రిల్ 29) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా.. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు స్వీకరించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగ్గా.. సోమవారంతో నామినేషన్ల విత్ డ్రా గడువు కూడా పూర్తైంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులపై ఓ స్పష్టత వచ్చింది.
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలుకాగా.. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉన్నారనే వివరాలను ఈసీ వెల్లడించనుంది. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన తర్వాత కూడా కొన్నిచోట్ల రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ స్థానంలో టీడీపీ లీడర్ వేటుకూరి వెంకట శివరామరాజు రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఉండి నుంచి మరోసారి టీడీపీ టికెట్ మీద పోటీచేయాలని భావించారు. అయితే రాజకీయ పరిణామాల మధ్య ఉండి టికెట్‌ను టీడీపీ నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు కేటాయించింది. తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుకు అవకాశం ఇచ్చారు.అయితే తనకు టికెట్ దక్కలేదని అసంతృప్తితో ఉన్న శివరామరాజు ఉండి స్థానంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. శివరామరాజు నామినేషన్ ఉపసంహరించుకోకపోవటంతో ఉండి రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే టీడీపీ నేత కలవపూడి శివ కూడా రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
మరోవైపు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం లోనూ టీడీపికి ఇలాంటి తలనొప్పులే వచ్చాయి. విజయనగరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత.. రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోవటంతో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి రెబల్ పోటు తప్పడం లేదు. విజయనగరం అసెంబ్లీ స్థానంలో టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు బరిలో ఉన్నారు. అయితే నూజివీడులో మాత్రం టీడీపీకి ఊరట దక్కింది. టీడీపీ రెబెల్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మాడుగుల తెలుగుదేశం రెబల్ అభ్యర్థి పైలా ప్రసాద్ కూడా తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. మడకశిర టీడీపీ రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ సైతం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.