ఆంధ్రప్రదేశ్ సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే మరో సెక్షన్ కింద ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు లక్షా 50 వేల జరిమానాను అట్రాసిటీ కోర్టు విధించింది. ఈ కేసులో మొత్తం 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. తీర్పు సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోర్టులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో పోటీపై త్రిమూర్తులకు భారీ ఊరటే లభించింది. ఎందుకంటే.. రెండేళ్లలోపే శిక్ష పడటంతో పోటీకి అడ్డంకులు తొలిగాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ కేసులో బెయిల్ కోసం వ్యక్తిగత పూచీతో పాటు బెయిల్కోసం త్రిమూర్తులు దరఖాస్తు చేసుకున్నారు.