ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రివ్యూ: నగరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 04:45 PM

సినిమా పేరు: నగరం 


నటీనటులు: సందీప్‌కిషన్‌, రెజీనా, శ్రీ, చార్లీ, రాందాస్‌, మధుసూదన్‌ తదితరులు 


సంగీతం: జావేద్‌ రియాజ్‌ 


ఛాయాగ్రహణం: సెల్వకుమార్‌ 


కూర్పు: ఫిలోమిన్‌ 


నిర్మాణం: ఏకేఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రొటన్షియల్‌ స్డూడియోస్‌ 


రచన, దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌ 


విడుదల: 10 మార్చి 2017


రెండు మూడు వేర్వేరు కథల్ని ఓ సంఘటనతో ముడిపెట్టడం, పరిచయం లేని పాత్రల మధ్య ఓ డ్రామా నడపడం హాలీవుడ్‌ సినిమాల శైలి. ఇప్పుడిప్పుడే అలాంటి కథలు మన దగ్గరకీ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాట ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. మణిరత్నం ‘యువ’ అలాంటి కథే. ‘జర్నీ’ కూడా రెండు కథల్ని కలిపిన సినిమానే. ఇప్పుడు ‘నగరం’ వచ్చింది. నాలుగు జీవితాల సమాహారమిది. మరి రకరకాల కథల్ని, వివిధ మనస్తత్వాల్ని దర్శకుడు ఒకే గాటన ఎలా కట్టగలిగాడు? ‘నగరం’లో ఏం చూపించాడు? తెలుసుకొంటే...


కథేంటంటే... 


‘నగరం’ సినిమా కథ ఇదీ.. అని నిర్దిష్టంగా చెప్పలేం. ఎందుకంటే ‘నగరం’ కథ కాదు. కొన్ని సంఘటనలు. సొంత వూరు నుంచి ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువకుడు, తన వూళ్లొనే ఉంటూ.. చిన్నప్పటి నుంచీ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్న మరో కుర్రాడు, పిల్లాడి ఆపరేషన్‌ కోసం నగరం వచ్చి, ఇక్కడ ఓ టాక్సీ నడుపుకొంటూ కడుపునింపుకోవాలని చూసే ఓ సగటు జీవి, డాన్‌ అయిపోదామని ఓ కిడ్నాప్‌ ముఠాతో చేతులు కలిపిన ఓ అమాయక జీవి... ఈ నలుగురి కథ ఇది. వాళ్లు చేసిన చిన్న చిన్న తప్పిదాలే వాళ్లని పెను ప్రమాదంలో పడేస్తాయి. అవేంటి? అందులోంచి ఎలా బయటపడ్డారు? అనేదే ‘నగరం’ కథ.


ఎలా ఉందంటే... 


కథ కంటే, కథనాన్ని, అందులో వేగాన్నీ, చిక్కుముడుల్నీ నమ్ముకొన్న సినిమా ఇది. తొలి సన్నివేశం నుంచే.. దర్శకుడు నేరుగా చెప్పాలనుకొన్న పాయింట్‌లోకి వెళ్లిపోయాడు. ఈ నాలుగు కథల్ని ఓచోట కలపడం, మలుపులు, థ్రిల్‌ ఇవన్నీ రక్తికట్టాయి. ఈ కథని దర్శకుడు సాధ్యమైనంత సహజంగా తెరకెక్కించాలని భావించాడు. అందుకే ‘రా’గా తీసేశాడు. సినిమాలో సెట్టు, సరికొత్త లొకేషన్లు అంటూ ఏం ఉండవు. ఆఖరికి హీరో ఇల్లు కూడా మామూలు మధ్యతరగతి ఇంటిలానే ఉంటుంది. బార్‌ సెటప్‌, కిడ్నాపర్స్‌ ఉండే డెన్‌ ఇవన్నీ అత్యంత సహజంగా చూపించారు. ఏ పాత్రకీ మేకప్‌ ఉండదు. ఆఖరికి కథానాయికతో సహా. పాత్రలు కూడా అంతే సహజంగా ప్రవర్తిస్తాయి. అయ్యో చేయని తప్పుకి అనవసరంగా ఇరుక్కొంటున్నారే అంటూ డ్రైవర్‌ పాత్రపైనా, ఉద్యోగం కోసం వచ్చిన కుర్రాడి పాత్రపైనా జాలి కలిగిందంటే... దర్శకుడు కచ్చితంగా విజయం సాధించినట్టే. ఇలాంటి కథల్ని తెరకెక్కించాలంటే, ఒప్పించాలంటే.. పకడ్బందీ స్క్రిప్టు అవసరం. దాన్ని చక్కగా రాసుకొన్నాడు దర్శకుడు. దాన్ని తెరపై చూపించడం ఇంకా కష్టం. అయినా సరే.. ఆ కష్టాన్నీ నేర్పుగా దాటే ప్రయత్నం చేశాడు. సన్నివేశాలు, మలుపులు, కో ఇన్సిడెన్స్‌ ఎక్కువగా ఉండడం కాస్త గందరగోళానికి గురి చేసే విషయాలే. పైగా సినిమా ఆద్యంతం సీరియస్‌గా సాగుతుంది. కిడ్నాపర్స్‌తో చేతులు కలిపిన అమాయకుడి పాత్రే.. కాస్త రిలీఫ్‌ ఇస్తుంది. ముగింపు అంత ఎఫెక్టివ్‌గా లేదు.


ఎవరెలా చేశారంటే... 


ఈ సినిమాలో ఏ పాత్రా నటించలేదు. అత్యంత సహజంగా ప్రవర్తించాయి. సందీప్‌ కిషన్‌, శ్రీ.. వీరిద్దరిలో ఎవ్వరూ హీరోలు కాదు. కథే హీరో. డ్రైవర్‌గా కనిపించిన చార్లి చాలాకాలం తరవాత సీరియస్‌ పాత్రలో కనిపించాడు. రాందాస్‌ అమాయకత్వం నవ్విస్తుంది. సాంకేతికంగా చూస్తే దర్శకుడికి ఎక్కువ మార్కులు పడతాయి. తాను కథని, సన్నివేశాల్ని చాలా జాగ్రత్తగా రాసుకొన్నాడు. ఏ క్యారెక్టర్‌నీ తక్కువ చేయలేదు. దేన్నీ అనవసరంగా పెంచలేదు. ఛాయాగ్రహణం సినిమా మూడ్‌కి తగ్గట్టు సాగింది. ఇలాంటి సినిమాల్ని ఎడిట్‌ చేయడం చాలా కష్టం. అందులో ఎడిటర్‌ నేర్పు కనిపించింది.


బలాలు 


+ స్క్రీన్‌ప్లే 


+ నటీనటుల ప్రతిభ 


+ కథలో వచ్చే మలుపులు


బలహీనతలు: 


- స్లోనెరేషన్‌ 


- క్లైమాక్స్‌


చివ‌రిగా: ఇదో స‌రికొత్త న‌గ‌రం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com