ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి సంరక్షణపై నిరంతర ధ్యాస:నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 11:24 AM

అమరావతి, మార్చి 10 : రిజర్వాయర్లలోనే నీళ్లు నిలపాలనే సంప్రదాయ ఆలోచన ధోరణిని జల వనరుల శాఖ ఇంజనీర్లు విడిచిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో భూగర్భంలో నీళ్లు నిలుపుకోవడమే అత్యుత్తమ మార్గమని చెప్పారు. నదుల అనుసంధానంతో పాటు సమర్ధ నీటి నిర్వహణ విధానం కూడా ప్రభుత్వ ప్రాధాన్య అంశమని స్పష్టంచేశారు. భూగర్భంలో 3 మీటర్ల మేర వర్షపు నీటిని నిలపగలిగితే 1000 టీఎంసీల నీటిని సంరక్షించినట్టేనని అన్నారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో నదుల అనుసంధానం, ఇతర అంశాలపై జల వనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘ఇంత పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల పనులు, జల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశం మొత్తం మీద ఏపీ మినహా మరొకటి లేదు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు లాంటి భారీ బహుళార్ధ సాధక ప్రాజెక్టు వేరొకటి రానున్న 20 ఏళ్లలో ఈ దేశంలో నిర్మాణమవుతుందని అనుకోలేం.. ఇటువంటి చారిత్రక అవకాశాన్ని దక్కించుకున్నందుకు రాష్ట్ర ఇంజనీర్లు గర్వపడాలి.. దేశం మొత్తం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి నిలిపిందని గ్రహించి అంచనాలకు తగ్గట్టు పనిచేయాలి’’- అని ముఖ్యమంత్రి అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు సరిపడేంత నీటిని ఎక్కడి నుంచి ఎలా రాబట్టుకోవాలనే అంశంపై కూడా జల వనరుల అధికారులు నిరంతర సమాలోచన చేయాలని చెప్పారు. జల అవసరాలకు తగినట్టుగా స్వల్ప, మధ్య తరహా, దీర్ఘకాలిక కార్య ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ ఆనాడు పునాదిరాళ్లు వేసిన ప్రాజెక్టులనే ఇప్పుడు తన హయాంలో ఒక్కొక్కటీ ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసుకుంటూ ప్రారంభించాల్సివస్తోందని చెబుతూ, రూ.250 కోట్లతో పూర్తి కావాల్సిన తోటపల్లి ప్రాజెక్టు 12 ఏళ్లకు పూర్తి కావడం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ముందుచూపుతో అటు తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు,  ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చానని గుర్తుచేశారు. తన హయాంలోనే గోదావరి అథారిటీ ఏర్పాటు చేశానని, అన్నాహజారే, రాజేంద్ర సింగ్ వంటి జల ఉద్యమకారులను తీసుకొచ్చి స్ఫూర్తివంతమైన కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. ఇకనుంచి ఏ ఇంజనీరింగ్ అధికారి కూడా అష్యూర్డ్ వాటర్, ఆయకట్టు వంటి పడిగట్టు పదజాలం వాడరాదని హితవుచెప్పారు. అటువంటి మాటలకు కాలం చెల్లిందని, అసలు ఎడారిలాంటి ప్రాంతాలకు నీళ్లను పారించి రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టించామని అన్నారు. పట్టిసీమ ద్వారా 100 రోజులలో 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు పారించి పంటలను కాపాడుకున్నామని అన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలు ఆయకట్టుగా మారాల్సిందేనని చెప్పారు. పట్టిసీమ స్ఫూర్తితో మరిన్ని నదుల అనుసంధానానికి పూనుకున్నామని తెలిపారు.
గోదావరి వరద జలాలు బొల్లపల్లి వరకు...
గోదావరి వరద జలాలను పెన్నా వరకు పారించి ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల బీడు భూములను మాగాణంగా మలచాలన్నదే తదుపరి ప్రయత్నమని చెప్పారు. గోదావరిని పెన్నాకు అనుసంధానం చేసే 4 అలైన్‌మెంట్లపై ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. నాలుగు ఆప్షన్లలో పోలవరం ప్రాజెక్టు నుంచి 320 టీఎంసీల నీటిని లిఫ్ట్, గ్రావిటీ విధానాల్లో మళ్లించి, గుంటూరు బొల్లపల్లి దగ్గర 45 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి సోమశిల, వెలిగొండకు  పారించే ప్రణాళికకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా కాలువను నిర్మించనున్నారు. అలాగే, కృష్ణానదిపై అక్విడెక్ట్ నిర్మాణం చేపడతారు. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద జలాలను బొల్లపల్లి వరకు, బొల్లపల్లి నుంచి సోమశిల, వెలిగొండ వరకు మళ్లిస్తారు. దీనిపై సాధ్యాసాధ్యాలను మరింత  లోతుగా అధ్యయనం జరిపి సవివర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. 3 మాసాలలో లైడార్ సర్వే పూర్తిచేయగలమని అధికారులు చెప్పారు.సమావేశంలో ఇంకా హంద్రీనీవా ప్రధాన కాలువల వెడల్పు, గాలేరు-నగరి, మల్లెమడుగు, స్వర్ణముఖి, చింతలపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ అందించారు. రెండు దశలలో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి 320 మంది రైతులలో ఇప్పటికే 212 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అధికారులు చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి అనుమతులు, ఆకృతులు, నిధులు అన్నీ సిద్ధంగానే వున్నాయని, ఎట్టి పరిస్థితులలోనూ వచ్చే ఏడాదికి విశాఖకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టీకరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2లక్షల 60 వేల పంట సంజీవని పంటకుంటలు నిర్మించినట్టు తెలిపారు.
ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం క్షేత్ర స్థాయికి వెళ్లాల్సిన అగత్యం లేదని, డ్రోన్ల సహకారంతో ఎక్కడి నుంచైనా పనుల నిరంతర పరిశీలన చేయవచ్చునని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు సూచించారు. జల వనరుల సమర్ధ వినియోగానికి ఉపకరించే జియో పోర్టల్ ఏర్పాటుపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్రో, ఎన్ఆర్ఎస్ఈతో ఒక అవగాహన ఒప్పందం చేసుకోబోతోందన్నారు. దీనికి సంబంధించి వాసర్ ల్యాబ్స్ అందించిన ప్రెజెంటేషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. బేసిన్, సబ్ బేసిన్ స్థాయిలలో జల మట్టాల వివరాలను తెలుసుకునే సౌలభ్యం ఈ కొత్త విధానంలో అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఇక రాష్ట్రంలో ఎక్కడెక్కడ  ఏ స్థాయిలో జల వనరులు వున్నాయో సరిగ్గా అంచనా వేయడానికి వీలవుతుంది. అలాగే, వర్షపాతం వివరాలను చాలా స్పష్టంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వాటర్ ఆడిటింగ్ ఒక్కటే కాకుండా గోదావరి వరద ముప్పును పసిగట్టడం కూడా ఈ విధానంలో సాధ్యం అవుతుంది. డ్రోన్లు, సెన్సర్లు వంటి అత్యాధునిక పరికరాల సహాయంతో రాష్ట్రంలో గల అన్ని జల వనరులపై నిరంతర పర్యవేక్షణ జరుపుకునే వీలుందని, ప్రతి ఒక్క అధికారి దీనికి సంబంధించిన పరిజ్ఞానంపై పట్టు సంపాదించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుఎస్‌ఏకు చెందిన ఓబెర్ మెయర్ హైడ్రో కంపెనీ రూపొందించిన గాలి ఆధారిత స్పిల్ వే గేట్లను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పరిశీలించారు. మెస్సర్స్ పీఆర్ పాటిల్ ఇంజనీర్స్ సంస్థ వీటి ప్రత్యేకతలను ముఖ్యమంత్రికి వివరించింది. వీటిని పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలోని చెక్ డ్యామ్‌లకు అమర్చి పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆధికారులకు సూచించారు. జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్ వెంకటేశ్వరరావు, పలువురు ఛీఫ్ ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com