గత 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ పోర్న్‌స్టార్ స్టోమీ డేనియల్స్‌తో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా ఆమెకు డబ్బులు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు ధ్రువీకరణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆమె కోర్టును ఆశ్రయించింది. లేక్ టాహోలో జరిగిన సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పోర్న్‌స్టార్, ట్రంప్ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన కేసు ఇది. దీనికి సంబంధించిన వివరాలను డేనియల్స్ తన స్వీయ పుస్తకం ‘ఫుల్ డిస్‌క్లోజర్’లో వెల్లడించారు. తాను ట్రంప్‌తో శృంగారంలో పాల్గొన్నట్టు వెల్లడించారు. అయితే, దీనిని మాజీ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.
తొలిసారిగా స్టోమీ, డొనాల్డ్ ట్రంప్‌లు 2006లో నెవాడా గోల్ఫ్ కోర్సులో కలుసుకున్నారు. ఆ సమయంలో డొనాల్డ్, స్టార్మీ డేనియల్స్ పోర్న్ స్టూడియో బూత్‌లో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. డేనియల్స్ అప్పుడు ఈ స్టూడియోలో ‘గ్రీటర్’గా పనిచేస్తున్నారు. అప్పటికి డేనియల్స్ వయస్సు 27.. ట్రంప్‌కి 60 సంవత్సరాలు. ఫోటోలో ట్రంప్ ఎరుపు టోపీ, పసుపు పోలో షర్ట్, ఖాకీ ప్యాంటు ధరించి ఉండగా.. డేనియల్స్, బిగుతుగా ఉన్న నల్లటి టాప్ ధరించి, అతని పక్కన నిలబడి ఉన్నారు.
డేనియల్స్‌ను కలవడానికి నాలుగు నెలల ముందు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా కొడుకు బారన్‌కు జన్మనిచ్చింది. చట్టపరంగా డేనియల్స్ పేరు స్టెఫానీ క్లిఫోర్డ్. ట్రంప్ అంగరక్షకులలో ఒకరు గోల్ఫ్ కోర్స్‌లోని అతని పెంట్ హౌస్‌ని సందర్శించమని తనను కోరినట్లు స్టోమీ పేర్కొన్నారు. ట్రంప్‌తో కలయిక గురించి ‘ఇది నేను శృంగారంలో అతి తక్కువ సమయం ఇదే కావచ్చు అని తన పుస్తకంలో మాజీ పోర్న్‌స్టార్ పేర్కొన్నారు. అంతేకాదు, ట్రంప్ బాడీ లాంగ్వేజ్ గురించి ఒక అసహ్యమైన వివరణను కూడా ఇచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మద్దతు కోరుతూ దేశమంతా తిరుగుతున్నప్పుడు.. డేనియల్స్ ఆయనతో సంబంధం గురించి కథనాన్ని విక్రయించాలని చూస్తున్నట్లు ఓ దినపత్రిక కనుగొంది. ట్రంప్ మిత్రుడికి చెందిన నేషనల్ ఎంక్వైరర్.. డేనియల్స్‌తో సంప్రదింపులకు డొనాల్డ్ ట్రంప్ న్యాయవాది, రాజకీయంగా నష్టకలిగించే సమస్యలను పరిష్కరించే కొహెన్‌ను నియమించింది.
అయితే, ట్రంప్‌నకు వ్యతిరేకంగా మారిన మైఖేల్ కోహెన్.. 2006 నాటి ఆ సంబంధం గురించి బయటపెట్టకుండా ఉండేందుకు డేనియల్స్‌కు 130,000 డాలర్లు (దాదాపు రూ.1.7 కోట్లు) ఇచ్చినట్టు అంగీకరించారు. స్ట్రోమీ డేనియల్స్, డొనాల్డ్ ట్రంప్ అనైతిక ఒప్పందంపై 2018లో ఆమె కోర్టుకు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ట్రంప్ మాత్రం తాను ఎప్పుడూ డేనియల్స్‌తో సెక్స్‌లో పాల్గొనలేదని లేదా ఎన్నికల ప్రచార సమయంలో సంబంధం బయటపడకుండా డబ్బులు ఇవ్వలేదని వాదిస్తున్నారు.
అయితే ట్రంప్‌పై కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని న్యూయార్క్ జ్యూరీ నిర్ధారించింది. డిఫెన్స్ అటార్నీ ప్రకారం.. మంగళవారం నాటికి అతన్ని కోర్టులో హాజరుపరచాలని భావిస్తున్నారు.